Jagan: రైతులకు అధిక ప్రయోజనం కలిగేలా ధాన్యం సేకరణ జరగాలి: సీఎం జగన్
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష
- హాజరైన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు
- దిశానిర్దేశం చేసిన సీఎం జగన్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అధిక ప్రయోజనాలను అందించేలా ధాన్యం సేకరణ జరగాలని అధికారులకు నిర్దేశించారు. రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ-క్రాపింగ్ డేటా ద్వారా అత్యంత పారదర్శక విధానంలో ధాన్యం సేకరణ ప్రక్రియ జరగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని వెల్లడించారు.
అంతేకాకుండా, వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమైన రైతులకు లబ్ది చేకూర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్లాంట్ డాక్టర్స్ విధానంపైనా సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. మార్చిలో ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రబీ సాగుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక డ్రోన్, భూసార పరీక్షలు చేసే పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో డ్రోన్లు ఉండాలని స్పష్టం చేశారు.