China: అంతరిక్షంలోకి కోతులను పంపనున్న చైనా

China To Send Monkeys To Space To Study How They Reproduce There

  • పునరుత్పత్తిపై ప్రయోగాల కోసమేనని వెల్లడి
  • గతంలో ఎలుకలను అంతరిక్షంలోకి పంపిన రష్యా
  • ఈ ప్రయోగం కోసం చైనా అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు

అంతరిక్ష కేంద్రంలో జీవశాస్త్ర ప్రయోగాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారరహిత స్థితిలో పునరుత్పాదకత ఎంతవరకు సాధ్యమనే ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం త్వరలో అంతరిక్షంలోకి కోతులను పంపించనున్నట్లు తెలిపారు. అక్కడ వాటి పెరుగుదల, పిల్లలను కనే అవకాశం ఎంతవరకు ఉందనేది పరీక్షించనున్నట్లు వివరించారు. సొంతంగా తలపెట్టిన అంతరిక్ష కేంద్రం ‘తియాంగాంగ్ స్పేస్ స్టేషన్’ కూడా దాదాపుగా పూర్తికావొచ్చినట్లు చైనా పేర్కొంది. దీనికి సంబంధించి ఇటీవలే చివరి మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపిన విషయాన్ని గుర్తుచేసింది.

ప్రత్యేకంగా మాడ్యుల్..
తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో కొంత భాగాన్ని జీవశాస్త్ర ప్రయోగాల కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. ఇందులో జీవ పరిణామంపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కోతులను అంతరిక్షంలోకి పంపించి, అక్కడ వాటి లైంగిక జీవనం, పునరుత్పాదకత శక్తిని పరీక్షించనున్నట్లు వివరించారు. అంతరిక్ష ప్రయోగాలకు నేతృత్వం వహించే చైనా శాస్త్రవేత్త జాంగ్ లూ ఈ వివరాలను వెల్లడించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది.

గతంలోనూ పలు ప్రయోగాలు..
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల శరీరంలో వచ్చే మార్పులకు సంబంధించి గతంలో చాలానే ప్రయోగాలు జరిగాయని పరిశోధకులు చెబుతున్నారు. కోల్డ్ వార్ సమయంలో రష్యా కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టిందని తెలిపారు. అంతరిక్షంలోకి పంపిన రాకెట్ లో కొన్ని ఎలుకలను ఉంచినట్లు పేర్కొన్నారు. దాదాపు 18 రోజుల పాటు జరిగిన ఈ అంతరిక్ష ప్రయోగంలో ఎలుకలు క్షేమంగానే తిరిగొచ్చాయని వివరించారు. 

ఈ ప్రయాణ కాలంలో ఎదురైన శారీరక ఇబ్బందులను అధిగమించడంతో పాటు ఎలుకలు లైంగికంగా కూడా కలిశాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, వాటిలో ఏ ఎలుక కూడా గర్భందాల్చడం కానీ, భూమ్మీదకు వచ్చాక పిల్లలను కనడం కానీ జరగలేదని తెలిపారు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు త్వరలో కోతులను అంతరిక్షంలోకి పంపించాలని భావిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు వివరించారు.

చెప్పినంత తేలిక కాదు..
అంతరిక్షంలో కోతుల మనుగడ అంత తేలిక కాదని సింగ్హువా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెహ్కూయ్ కీ చెప్పారు. అంతరిక్ష కేంద్రం వరకు వాటిని చేర్చడం కష్టం కాకపోయినా.. అక్కడ వాటికి రోజూ ఆహారం అందించడం, వాటి వ్యర్థాలను తొలగించడం వంటి పనుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కెహ్కూయ్ చెప్పారు.

More Telugu News