Twitter: పొరపాటు జరిగింది.. తిరిగొచ్చేయండి! తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి ట్విట్టర్ పిలుపు

Twitter Asks Dozens Of Laid Off Staff To Return

  • ట్విట్టర్ లో సగం మందిని ఇంటికి పంపిన యాజమాన్యం
  • అందులో పలువురి సేవలు అవసరమని భావిస్తున్న ట్విట్టర్
  • సేఫ్టీ టీమ్ లో కొంతమంది ఉద్యోగులను తిరిగి ఆహ్వానిస్తూ లేఖలు

ట్విట్టర్ లో దాదాపు సగం మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించిన విషయం తెలిసిందే! అయితే, ఈ తొలగింపుల ప్రక్రియలో పొరపాటు జరిగిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కొంతమంది ఉద్యోగులను పొరపాటున ఇంటికి పంపినట్లు తెలిపాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు పంపినట్లు వివరించాయి. ఈమేరకు బ్లూమ్ బర్గ్ ఆదివారం ఓ కథనం వెలువరించింది.

సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులలో సగం మందిని మస్క్ ఇంటికి పంపించేశారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరం ఉంటుందని, వారి తొలగింపు విషయంలో పొరపాటు జరిగిందని బ్లూమ్ బర్గ్ కథనంలో పేర్కొంది. ట్విట్టర్ లో ఆ సంస్థ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీసుకురాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్లు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే, ఈ కథనంపై ట్విట్టర్ అధికారికంగా స్పందించలేదు. మరోపక్క, బ్లూ టిక్ చార్జీల పెంపును అమలు చేసేందుకు అవసరమైన మార్పులను ట్విట్టర్ చేపట్టింది. ఇందులో భాగంగా యాపిల్ యాప్ స్టోర్ లో ట్విట్టర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్ లోడ్ చేసింది.

More Telugu News