chest infections: పట్టణ వాసులూ జాగ్రత్త.. కాలుష్యంతో పెరిగిపోతున్న ఛాతీ ఇన్ఫెక్షన్లు
- శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువ
- బయటి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగకపోవడమే మంచిది
- రక్షణ కోసం టీకాలు తీసుకోవాలన్నది వైద్యుల సూచన
దేశ రాజధాని అత్యంత కాలుష్య నగరంగా మారిపోయింది. అంతెందుకు, మన భాగ్యనగరంలోనూ కాలుష్యం విషమ స్థితికి చేరుతోంది. గుండె జబ్బులకు, తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే పీఎం 2.5 క్యూబిక్ మీటర్ గాలిలో 70 పాయింట్లను దాటిపోయింది. దీని సాధారణ స్థాయి 5. పెరిగిపోయిన ఈ కాలుష్యం ఛాతీ ఇన్ఫెక్షన్, న్యూమోనియాకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యలతో తమ వద్దకు వస్తున్న రోగుల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు.
కాలుష్యం వల్ల కేవలం శ్వాసకోశ వ్యాధులే కాదు.. దీర్ఘకాలం పాటు వీటికి గురికావడం వల్ల గుండె జబ్బులు, నాడీ సంబంధ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో చల్లటి వాతావరణంలో కాలుష్య కణాలు పైకి పోకుండా తక్కువ ఎత్తులోనే గాలిలో ఉండిపోతాయి. దీంతో ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరుగుతుంది. అప్పటికే గుండె జబ్బులు లేదా మధుమేహం, కిడ్నీ సమస్యలు, శ్వాస కోస సమస్యలైన ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటివి ఉన్న వారికి రిస్క్ పెరిగిపోతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా ఈ కాలంలో ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
- నివారణ..
60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఫ్లూ, న్యూమోనియాకు టీకాలు తీసుకోవాలి. తీవ్ర ఆరోగ్య సమస్యలున్న ఇతర వయస్సులోని వారు కూడా టీకాలు తీసుకోవాలి. - సాధ్యమైనంత వరకు బయటి ప్రాంతాల్లో తిరగకూడదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్ 95 మాస్క్ ను సరిగ్గా ధరించి వెళ్లాలి. లేదంటే కనీసం తడిపిన వస్త్రాన్ని పిండేసి ముక్కుకు అడ్డంగా పెట్టుకోవాలి.
- చల్లటి నీరు తాగకూడదు. గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. గదిలో చల్లటి వాతావరణం లేకుండా చూసుకోవాలి.
- పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- పక్క దుప్పట్లు, పిల్లో కవర్లను తరచూ వాష్ చేసుకోవాలి.
- అధిక జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలు, గాలి, వెలుతురు తగినంత లేని చోటకు వెళ్ల కూడదు.
- దగ్గు, జలుబు వేధిస్తుంటే జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.