chronic heart failure: ఐరన్ ఎక్కువైనా ప్రమాదమే.. హార్ట్ ఎటాక్ రిస్క్!
- ఐరన్ కారణంగా గుండె కండరాల్లో ఫ్యాటీ టిష్యూ
- ఐరన్ ను తగ్గించినప్పుడు కరుగుతున్న కొవ్వులు
- ఇండియానా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
రక్తంలో హిమోగ్లోబిన్ తగినంత ఉండేందుకు ఐరన్ తోడ్పడుతుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతతో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఈ ఐరన్ సరిపడానే ఉండాలి. ఎక్కువైతే ప్రమాదమే. ఐరన్ హార్ట్ ఫెయిల్యూర్ కు కారణమవుతుందంటే నమ్మగలమా..? కానీ, తాజా అధ్యయనం తర్వాత దీన్ని నమ్మక తప్పదు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన రోహన్ ధర్మ కుమార్ ఆధ్వర్యంలో ఒక అధ్యయనం జరిగింది.
ఐరన్ ఎక్కువ
ఐరన్ ను శరీరం నుంచి తగ్గించి చూసినప్పుడు గుండె కండరాల్లో కొవ్వులు తగ్గుతున్నట్టు వీరు తెలుసుకున్నారు. హార్ట్ లో ఫ్యాటీ టిష్యూ ఏర్పడడం వెనుక ఐరన్ ఉన్నట్టు వీరు నిర్ధారణకు వచ్చారు. ‘‘నాన్ ఇన్వేసివ్ ఇమేజింగ్, హిస్టాలజీ, మాలెక్యులర్ బయోలజీ టెక్నిక్ లు, పలు ఇతర టెక్నాలజీల సాయంతో ఎర్ర రక్త కణాల నుంచి వచ్చే ఐరన్ ఫ్యాటీ టిష్యూ ఏర్పాటుకు కారణమవుతోందని గుర్తించాం’’ అని డాక్టర్ ధర్మ కుమార్ తెలిపారు. ఐరన్ ను తొలగించి చూసినప్పుడు గుండె కండరాల్లో ఫ్యాట్ తగ్గుతున్నట్టు చెప్పారు.
మొదటి సారి
గుండె వైఫల్యంతో వచ్చే హార్ట్ ఎటాక్ కు మొదటి సారి మూలకారణాన్ని కనుగొన్నట్టు డాక్టర్ ధర్మ కుమార్ చెప్పారు. రక్తస్రావం కారణంగా వచ్చే మయోకార్డియల్ ఇన్ఫార్షన్ రోగుల్లో ఐరన్ తాలూకూ ప్రభావాలను తగ్గించే చికిత్సలను కనుగొనేందుకు తమ అధ్యయనం మార్గదర్శనం చేస్తుందన్నారు. ఎక్కువగా ఉన్న ఐరన్ ను శరీరం నుంచి బయటకు విసర్జితమయ్యేలా చేసి, రిస్క్ తగ్గించేందుకు డాక్టర్ ధర్మ కుమార్ బృందం ఐరన్ చెలేషన్ థెరపీపై క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక తాజా పరిశోధన కొంత మందిని కాపాడినా పరిశోధకుల కృషి ఫలించినట్టే.