Students: నల్గొండ జిల్లాలో రైతుల పంటను కాపాడిన విద్యార్థులు
- దోమలపల్లి ఐకేపీలో ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు
- ఇంతలో వర్షం రాక.. వెంటనే స్పందించిన విద్యార్థులు
- ధాన్యంపై పరదాలు కప్పిన వైనం
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. అయితే, దోమలపల్లి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకున్న సమయంలో వర్షం రాగా, స్థానికంగా ఉన్న విద్యార్థులు సకాలంలో స్పందించడంతో రైతుల పంట నీటిపాలు కాకుండా నిలిచింది.
నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామంలోని రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లో తమ వరిధాన్యం ఆరబెట్టారు. ఇంతలో వర్షం రావడంతో పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు పరుగుపరుగున అక్కడికి వచ్చి, ఆ ధాన్యపు రాశులపై పరదాలు కప్పి కాపాడారు. కొద్దిగా ఆలస్యం అయ్యుంటే పంట మొత్తం తడిసి పాడయ్యేది. కాగా, విద్యార్థులు చేసిన పని అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. రైతులు, ఇతరులు ఆ విద్యార్థులను అభినందించారు.