Visakhapatnam: మేమేమీ అబ్బాయిలతో వెళ్లడం లేదు.. మా కోసం వెతకొద్దు: లెటర్ రాసి వెళ్లిపోయిన నలుగురు విద్యార్థినులు

10th Class girl Missing from home after write a letter in visakha

  • విశాఖపట్టణంలో ఘటన
  • స్కూలు నుంచి వచ్చాక లేఖ రాసి వెళ్లిపోయిన అమ్మాయిలు
  • మంచి పొజిషన్‌లోకి వచ్చాక తిరిగి వస్తామని రాసిన విద్యార్థినులు
  • 12 గంటల్లోనే పట్టుకున్నపోలీసులు

‘మా కోసం వెతక్కండి.. మా కాళ్లపై మేం నిలబడి మంచి పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాం’ అని లేఖరాసి నలుగురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విశాఖపట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే, విషయం పోలీసుల దృష్టికి చేరడంతో 12 గంటల్లోనే వారిని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుకుంటున్న నలుగురు విద్యార్థినులు తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని, మంచి స్థానానికి వచ్చాక తిరిగి కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బడి నుంచి వచ్చాక ఓ లేఖ రాశారు. 

అందులో.. ‘‘మా కోసం వెతక్కండి. మేం మా కాళ్లమీద బతకాలని దూరంగా వెళ్లిపోతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మా బతుకు కోసం వెళ్తున్నాం. అలాగని మేము అబ్బాయిలతో వెళ్లిపోతున్నామని అనుకోకండి. కేవలం మేము పైకి ఎదగడానికి మాత్రమే వెళ్తున్నాం. మమ్మల్ని వెతక్కండి. మేం ఎక్కడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మేం మంచి పొజిషన్‌కి వచ్చాక మేమే మీ దగ్గరికి వస్తాం’’ అని రాసుకొచ్చారు. దానిని ఓ బాలిక తన ఇంట్లో పెట్టి వచ్చింది.

సాయంత్రం ఆరు గంటల సమయంలో బయలుదేరిన వారు విశాఖ బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఇలా పలు ప్రాంతాల్లో తిరిగారు. మరోవైపు, రాత్రయినా కుమార్తెలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వారు రాసిన లేఖ దొరకడంతో మరింత భయపడ్డారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు వారి కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో గాలించారు. చివరికి గాజువాకలో ఉన్నట్టు తెలుసుకుని నిన్న మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News