Yanamala: బుగ్గన వ్యాఖ్యలకు గణాంకాలతో బదులిచ్చిన యనమల... వివరాలు ఇవిగో!

Yanamala counters Buggana comments

  • యనమలకు వాస్తవాలు తెలియవన్న బుగ్గన
  • అందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శలు
  • బుగ్గన వ్యాఖ్యలకు యనమల కౌంటర్
  • అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని వెల్లడి

ఏపీ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించడం తెలిసిందే. తాజాగా బుగ్గన వ్యాఖ్యలపై యనమల కౌంటర్ ఇచ్చారు. బుగ్గన మాటలు చీకట్లో అద్దం చూపించి పొగుడుకున్న విధంగా ఉన్నాయని విమర్శించారు. అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలనుకుంటున్నారని అన్నారు.

విద్యుత్ మీటర్ల పేరుతో రూ.3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ విద్యుత్ వినియోగం తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నామనడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయ మోటార్ల విద్యుత్ వినియోగం తెలుసుకోవడానికి హెచ్.పి.డీ.ఎస్ సిస్టం తీసుకొచ్చి 33 కేవీ లైన్ నుంచి 11 కేవీకి మళ్లించి ఎల్టీ లైన్ ద్వారా మోటార్లకు ఇచ్చే విధానం తీసుకొచ్చారని యనమల వివరించారు. 

విద్యుత్ వినియోగం తెలుసుకోవాలంటే మార్కెట్ లో దొరికే రూ.300 విలువ చేసే విద్యుత్ మీటర్ సరిపోతుందని అన్నారు. ఒక్కో మీటర్ రూ.35 వేలు పెట్టి కొని కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

"ఏడు నెలల్లో 53,500 కోట్లు అప్పు చేసింది చాలక మారిటైమ్ బోర్డు ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసేందుకు రంగం సిద్దం చేశారు. 2014 నుంచి 2019 ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.2,57,210 కోట్లు అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు మూడేళ్లన్నరేళ్లలో రూ.4.5 లక్షల కోట్లు. ఏడాదికి దాదాపు రూ.1,20,000 కోట్లు అప్పు చేసి టీడీపీ కంటే తక్కువ అప్పు చేసామని చెప్పడం బుగ్గన దిగజారుడుతనానికి నిదర్శనం. లక్ష కోట్లు ఆఫ్ బడ్జట్ బారోయింగ్స్ చేసి బడ్జట్ లో చూపకుండా దాచిపెట్టారని కాగ్ తప్పుబట్టిన మాట వాస్తవం కాదా?" అని యనమల నిలదీశారు. 

టీడీపీ హయాంలో దాదాపు రూ.10 వేల కోట్లు కౌలు రైతులు రుణం పొందితే, వైసీపీ నాలుగేళ్లలో ఇచ్చింది కేవలం రూ.4 వేల కోట్ల లోపు మాత్రమే అని యనమల వెల్లడించారు. బుగ్గన అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. 

రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ, పావలా వడ్డీ, పంట రుణాలను వైసీపీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. మూడున్నరేళ్లలో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అయినా బుగ్గన అబద్ధాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతోందని యనమల ఆగ్రహం వెలిబుచ్చారు.

Yanamala
Buggana Rajendranath
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News