Ukraine: 24 గంటల్లో 1000 మంది రష్యా సైనికులను హతమార్చిన ఉక్రెయిన్
- రష్యాకు గట్టి ఎదురుదెబ్బ
- ఒక్కరోజులో ఇంతమంది సైనికులను కోల్పోవడం రష్యాకు ఇదే ప్రథమం
- రష్యా సైనికుల వద్ద నామమాత్రపు ఆయుధాలు
- పక్కా ప్రణాళికతో ఉక్రెయిన్ బలగాల దాడులు
ఉక్రెయిన్ పై గత ఎనిమిది నెలలుగా విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు 24 గంటల వ్యవధిలో 1000 మంది రష్యా సైనికులను హతమార్చాయి.
సరైన ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలోకి వచ్చిన రష్యా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలయ్యాక, రష్యా ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోవడం ఇదే ప్రథమం. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 71,200 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు వెల్లడించింది.
రష్యా సైనికుల్లో చాలామంది సరైన ఆయుధాలు లేకుండానే యుద్ధరంగంలో అడుగుపెట్టారని ఇటీవలే బ్రిటన్ రక్షణ శాఖ నిఘా నిపుణులు వెల్లడించారు. ఈ విశ్లేషణ నిజమే అనిపించేలా నామమాత్రపు ఆయుధాలతో ఉన్న రష్యా సైనికులను ఉక్రెయిన్ బలగాలు తేలిగ్గానే కడతేర్చాయి.
కాగా, కొన్ని రోజుల కిందట పదుల సంఖ్యలో క్షిపణులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో కీవ్ లో అంధకారం నెలకొంది, తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, కొన్నిరోజుల వ్యవధిలోనే కీవ్ లో విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది.