sleep: నిద్రకు, మధుమేహానికి లింక్.. తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
- నిద్రలో సహజంగా పెరిగిపోయే బ్లడ్ గ్లూకోజ్
- తగినంత సమయం నిద్ర పోవడమే దీనికి రక్షణ కవచం
- నిద్ర తగ్గితే మధుమేహం రిస్క్
- రుట్గర్స్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
మంచి నిద్ర వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిద్రతోనే శరీరానికి తాజాదనం వస్తుంది. నిద్రలో ఎన్నో అవయవాలు మరమ్మతుకు గురవుతాయి. అందుకే తగినంత నిద్ర ఉండే వారికి అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తుంటాయి. నిద్రకు, మధుమేహానికి లింక్ ఉందంటున్నారు పరిశోధకులు. నిద్ర తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలు పలకరిస్తాయని ఇప్పుడే కాదు, గతంలోనూ పలు పరిశోధనలు తేల్చాయి. నిద్ర తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుందని, మధుమేహం సమస్య బారిన పడతారని గతంలోనూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కాకపోతే ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటన్న దానిపై అధ్యయనాలు జరుగుతున్నాయి.
రుట్గర్స్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. మన శరీరం ప్రతి రోజూ కొన్ని రకాల మార్పులకు లోనవుతుంటుంది. దీన్ని సిర్కాడియన్ రిథమ్ అంటారు. వ్యక్తి నిద్ర సమయంలో రక్తంలో గ్లూకోజ్ ను ఇది సహజంగానే పెంచుతుంది. కానీ, సహజసిద్దమైన ఈ పెరుగుదల పట్ల భయం అక్కర్లేదు. మంచి నిద్రతో శరీర వ్యవస్థలు పటిష్ఠమై, ఈ విధమైన బ్లడ్ షుగర్ పెరుగుదల ప్రభావాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి కొద్ది సమయం పాటు, అలాగే నాణ్యమైన నిద్ర లేని వారిలో రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల ప్రభాలను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థ విఫలమవుతుందని రుట్గర్స్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు.
కంటినిండా నిద్ర పోవడం, ఒక రోజులో ఎన్ని గంటలు నిద్ర పోతున్నారు? నిద్రలో అన్ని దశలూ ఉంటున్నాయా? వయసు ఎంత, ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా వ్యక్తి నిద్రకు, రక్తంలో గ్లూకోజ్ కు మధ్య బంధాన్ని నిర్ణయిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కనుక నిద్ర సమస్యలు ఏవి ఉన్నా కానీ, వాటితో మధుమేహం రిస్క్ ఉంటుందని తెలుస్తోంది.