Gujarat: మోర్బీ బ్రిడ్జి మరమ్మతులను గోడ గడియారాల తయారీ కంపెనీ చేపట్టిందట
- గుజరాత్ లో కూలిన తీగల వంతెన
- 140 మందికి పైగా మరణించిన వైనం
- అహ్మదాబాద్ కు చెందిన ఒరెవా కంపెనీ మరమ్మతులు చేపట్టినట్టుగా గుర్తింపు
- నిర్మాణ రంగంలో అనుభవమే లేని కంపెనీగా ఒరెవా
గుజరాత్ లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో ఇప్పటికే 140 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఇంకే ఘటనలోనూ చోటుచేసుకోలేదు. మరమ్మతుల కోసం మూతపడి... మరమ్మతుల తర్వాత తెరచుకున్న రోజుల వ్యవధిలోనే ఈ బ్రిడ్జి కూలిపోవడం, ఈ ఘటనలో 140 మందికి పైగా చనిపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన సంస్థ ఏదన్న విషయంపై ఆరా తీయగా... పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. నిర్మాణ రంగంలో కనీస అనుభవం కూడా లేని కంపెనీతో ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేయించిన వైనం కూడా బయటపడింది.
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ కు చెందిన ఒరెవా గ్రూప్ మోర్బీ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టింది. గోడ గడియారాలు, ఈ బైకుల తయారీ, సీఎఫఎల్ బల్బుల తయారీలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి అసలు నిర్మాణ రంగంలో కనీస అనుభవం కూడా లేదట. ఆ కంపెనీ వెబ్ సైట్ లో కూడా నిర్మాణ రంగం అన్న ప్రస్తావన కూడా లేదట. నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేని కంపెనీకి మోర్బీ బ్రిడ్జీ మరమ్మతులతో పాటు నిర్వహణ కాంట్రాక్టు ఎలా దక్కిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. నెట్ వర్త్ పరంగా ఏటా రూ.800 టర్నోవర్ కలిగిన ఈ కంపెనీని అహ్మదాబాద్ కు చెందిన ఒదావాజీ రాఘవ్ జీ పటేల్ దాదాపుగా 50 ఏళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించగా...ఆయన నెల క్రితమే మరణించారట. మోర్బీ బ్రిడ్జి మరమ్మతులతో పాటు బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ల పాటు చేపట్టేందుకు ఒరెవా గ్రూప్ గుజరాత్ సర్కారు నుంచి కాంట్రాక్టు పొందిందట.