Asymptomatic: పైకి లక్షణాలు కనిపించని బ్రెస్ట్ కేన్సర్ ను గుర్తించేది ఎలా?

Asymptomatic Breast Cancer How to diagnose the tricky cancer signs

  • ఏటా స్క్రీనింగ్ కు వెళ్లడం మెరుగైన మార్గం
  • ఈ మహమ్మారి 2-5 ఏళ్ల పాటు బయటపడదు
  • ప్రతి నెలా చేతులతో స్వయంగా వక్షోజాలను పరీక్షించుకోవాలి

బ్రెస్ట్ కేన్సర్ (వక్షోజాల్లో వచ్చే కేన్సర్ కణితులు) కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వక్షోజాల్లో సాధారణ కణాలు అసాధారణ స్థాయిలో నియంత్రించలేని విధంగా విడిపోవడం బ్రెస్ట్ కేన్సర్ కు దారితీస్తుంది. ఇలా అసహజంగా విడిపోయిన కణాలతో కేన్సర్ కణతి ఏర్పడుతుంది. ఇది అక్కడి నుంచి ఇతర అవయవాలకు వ్యాప్తి అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్రెస్ట్ కేన్సర్ లోనే చాలా అడ్వాన్స్ డ్ స్టేజ్ (బాగా విస్తరించిన)ను మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ గా చెబుతారు. ఆ దశలో చికిత్సల ఆప్షన్లు తక్కువే. రికవరీ కూడా చాలా తక్కువ. కనుక బ్రెస్ట్ కేన్సర్ ను ఆరంభంలో గుర్తించడం ద్వారానే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. 

పరీక్షలు..
 అందుకని 30 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి కేన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ఒక్కటే నేటి రోజుల్లో ముందస్తు గుర్తింపునకు మెరుగైన మార్గమని చెప్పుకోవాలి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే 30 ప్లస్ వయసు మహిళల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. అందుకే 30 నుంచే పరీక్షలకు వెళ్లడం మేలు. ఏటా గైనకాలజిస్ట్ తో వక్షోజాల పరీక్ష, రెండేళ్లకోసారి మమ్మోగ్రఫీ చేయించుకోవాలి. రిస్క్ ఎక్కువగా ఉండే వారు 25 ఏళ్ల నుంచే స్క్రీనింగ్ చేయించుకోవాలని ముంబైలోని లీ నెస్ట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ముకేశ్ గుప్తా సూచించారు. ఎక్స్ రే మమ్మోగ్రఫీ, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎంఆర్ ఐ, సీటీ స్కాన్, పీఈటీ స్కాన్ అందుబాటులో ఉన్నాయని, ఇవి వక్షోజాల్లో మాలిగ్నెన్స్ ను గుర్తిస్తాయని చెప్పారు. కేన్సర్ తొలి దశలో 2-5 ఏళ్ల పాటు బయటపడదని, కనుక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా గుర్తించడం ఒక్కడే మెరుగైన మార్గమని తెలిపారు.

స్వీయ పరీక్ష
నెలకోసారి అయినా మహిళలు తమంతట తామే వక్షోజాలను చేతితో పట్టుకుని కొత్తగా ఏవైనా గడ్డలు ఏర్పడుతున్నాయేమో పరిశీలించుకోవాలన్నది వైద్యుల సూచన. అలాగే ఆకృతిలో ఏవైనా మార్పులున్నాయా? కూడా చూసుకోవాలి. ఏవైనా గుంటలు (డింప్లింగ్) లేదంటే వక్షోజాలపై ఎక్కడైనా చర్మం ఉబ్బెత్తుగా అనిపిస్తుందా? చూడాలి. నిపుల్స్ లో మార్పులు వస్తున్నాయా? చెక్ చేయాలి. ఏదైనా ద్రావకం లీక్ అవుతుందా? ఇవన్నీ హెచ్చరిక సంకేతాలేనని వైద్యుల వివరణ. 

చికిత్సలు
బ్రెస్ట్ కేన్సర్ లో ఏ రకం, ఏ దశలో ఉంది? ఎంత మేర విస్తరించింది? అనే అంశాల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. సర్జరీ చేసి కేన్సర్ విస్తరించిన భాగాన్ని తొలగించడం, కీమో థెరపీ, రేడియేషన్, హార్మోన్ థెరపీల్లో ఒకటి లేదా ఒకటికి మించిన చికిత్సలను ఏకకాలంలో చేయవచ్చు. 

నివారణ
బ్రెస్ట్ కేన్సర్ రాకూడదంటే.. పిల్లలకు పాలివ్వడం ఎక్కువ రక్షణగా నిలుస్తుంది. బరువు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితి మించి ఉండకూడదు. శారీరక వ్యాయామాలు ముఖ్యంగా ఏరోబిక్ చేయాలి.

  • Loading...

More Telugu News