G Jagadish Reddy: ప్రమాణం చేయమని బండి సంజయ్ ని ఎవరడిగారు?: మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy comments on Bandi Sanjay

  • ఎమ్మెల్యేల కొనుగోలు రగడ
  • తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • కుట్రను తమ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని వెల్లడి
  • అమిత్ షా యాదాద్రిలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రలోభపెట్టినట్టు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. 

గుళ్లో ప్రమాణం చేయమని బండి సంజయ్ ని ఎవరడిగారని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. "మునుగోడు గడ్డపై అమిత్ షా చెప్పిన మాటలను నిజం చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారు. బండి సంజయ్ ఇప్పుడు అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా?" అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. 

బీజేపీ కుట్రలను తమ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని, దొంగలను విజయవంతంగా పట్టుకున్నారని వెల్లడించారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ప్రలోభాలపై వాస్తవాలు బయటికి వస్తున్నాయని, బీజేపీ నేతలు దోషులు అయ్యారని వివరించారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు

More Telugu News