Bombay High Court: పెళ్లయిన మహిళతో ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుంది?: బాంబే హైకోర్టు
- విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టేసిన కోర్టు
- ఇంటి పనులు చేయడమంటే అది కుటుంబం కోసమే అవుతుందన్న న్యాయస్థానం
- పనిమనిషి చేసే పనితో పోల్చకూడదని స్పష్టీకరణ
ఇంటి పనులు చేయమని పెళ్లయిన మహిళకు చెప్పడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ తేల్చి చెప్పింది. ఇంటి పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని చెబుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం ప్రారంభించాడని, కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.