TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. నిందితుల రిమాండ్‌కు కోర్టు తిరస్కరణ
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- గత రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన పోలీసులు
- లంచం సొమ్ము దొరకనందున పీసీ యాక్ట్ వర్తించదన్న కోర్టు
- తక్షణం విడిచిపెట్టాలని ఆదేశం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని న్యాయమూర్తి జి.రాజగోపాల్ పోలీసులను ఆదేశించారు.
అరెస్ట్ సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని పేర్కొన్నారు. ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గత రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని విడిచిపెట్టినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.