Pope francis: పోర్నోగ్రఫీపై పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరిక
- మనసులను బలహీనపరుస్తుందన్న పోప్ ఫ్రాన్సిస్
- సంతోషాన్ని పంచుకునే వేదికలుగానే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచన
- పోర్నోగ్రఫీని ప్రజారోగ్యానికి ముప్పుగా ప్రకటించాలని వ్యాఖ్య
క్రైస్తవ ప్రధాన మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆన్ లైన్ పోర్నోగ్రఫీ విషయంలో సమాజాన్ని హెచ్చరించారు. పోర్నోగ్రఫీ పట్ల బలహీనత మత గురువులు, విద్యార్థుల హృదయాలను బలహీనంగా మారుస్తుందన్నారు. రోమ్ లో చదువుతున్న విద్యార్థులు, మత గురువుల నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు పోప్ స్పందించారు.
క్రైస్తవులుగా ఉన్నందుకు ఆ సంతోషాన్ని పంచుకునే వేదికలుగానే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. పనికి విఘాతం కలిగించే వార్తలు అదే పనిగా వినడం, సంగీతాన్ని ఆస్వాదించడం కూడా తగదన్నారు.
‘‘డిజిటల్ పోర్నోగ్రఫీ విషయంలో ఉద్రేక భావాన్ని కలిగి ఉండొచ్చు. చాలా మంది వ్యక్తులు, చాలా మంది స్త్రీలు, మత గురువులు, సన్యాసినులు కూడా వాటిని చూస్తున్నారు. ఇది పాపం. చిన్నారులను వేధించడం వంటి క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించే నేను మాట్లాడడం లేదు. అది ఇప్పటికే అధోగతిలో ఉంది. నైతిక పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడుతున్నా’’అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ పోర్నోగ్రఫీ గురించి ఈ ఏడాది జూన్ లోనూ హెచ్చరించారు. ఇది స్త్రీ, పురుషుల శాశ్వత ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా దీన్ని ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.