Pattabhi: వ్యవసాయ మీటర్ల కొనుగోళ్ల పేరుతో భారీ కుంభకోణానికి జగన్ ప్రభుత్వం తెరలేపింది: పట్టాభి
- రూ. 6,480 కోట్ల కుంభకోణానికి తెరలేపారన్న పట్టాభి
- బినామీ కడప కంపెనీలను అడ్డం పెట్టుకుని స్కామ్ చేస్తున్నాారని ఆరోపణ
- సెప్టెంబర్ లో డిస్కంలకు రూ. 860 కోట్ల బకాయి పెట్టారు
ఏపీలో రైతుల వ్యవసాయానికి సంబంధించి కొత్త మీటర్లను బిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీని వెనుక జగన్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి తెరలేపిందని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. ఒక్కో మీటర్ ను రూ. 35 వేల వంతున కొనుగోలు చేస్తూ స్కామ్ కు తెరతీశారని విమర్శించారు. మొత్తం 19,63,008 మీటర్లకు గాను రూ. 6,480.34 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని చెప్పారు. వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లపై విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చెపుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. పెద్దిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెపుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి సర్కార్ తమ బినామీ కడప కంపెనీలను అడ్డంపెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపిందని వార్తపత్రికలు ప్రచురించిన కథనాలు నూటికి నూరు శాతం నిజం అని అన్నారు.
రైతులకు వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీలను చెల్లించకుండా బకాయిలు పెట్టిందని... ఇప్పుడు మీటర్లు బిగించి, కరెంటు బిల్లులను రైతుల ఖాతాల్లోకి ఠంచనుగా జమ చేస్తామని చెపితే జనాలు ఎలా నమ్ముతారని పట్టాభి ఎద్దేవా చేశారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే డిస్కంలకు రూ. 860 కోట్ల బకాయి పెట్టారని దుయ్యబట్టారు.