Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే
- ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం
- సోనియా, రాహుల్, ప్రియాంక సహా ముఖ్య నేతలు హాజరు
- అంతకుముందు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన ప్రత్యర్థి శశిథరూర్ పై గెలవడం తెలిసిందే. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీలు, పీసీసీ, సీఎల్పీ నేతలు దీనికి హాజరయ్యారు. అంతకుముందు ఖర్గే రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.