Vangalapudi Anitha: ముఖ్యమంత్రి బూతుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుపడుతున్నారు: వంగలపూడి అనిత
- జూమ్ ద్వారా అనిత ప్రెస్ మీట్
- సీఎం జగన్, వాసిరెడ్డి పద్మలపై విమర్శలు
- జగన్ మాట తప్పి, మడమ తిప్పాడని వ్యాఖ్యలు
- మహిళా కమిషన్ కాదు జగన్ కమిషన్ అంటూ ఆగ్రహం
అన్నగా ఆడబిడ్డలకు అండగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పాడని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణ గాలికొదిలేసి కిరాతకులు, నేరస్థులకు అండగా నిలబడుతున్నాడని, ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనిత నేడు జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రోజుకు సగటున మహిళలపై 49 నేరాలు జరుగుతున్నాయంటే ఆడబిడ్డల రక్షణ అంశంలో జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. సైకో సీఎం మూడున్నరేళ్ల పాలనలో ఆడబిడ్డలపై 45 వేలకు పైగా నేరఘటనలు జరిగాయని వెల్లడించారు.
"ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఆడబిడ్డలు సైతం దుర్మార్గుల దుశ్చర్యలకు బలైపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యంవల్లే కడప జిల్లా బద్వేల్ మండలంలో అనూష చనిపోయింది. జగన్ రెడ్డి ఆర్భాటంగా చెప్పే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ ఆడబిడ్డల రక్షణకు కొరగాకుండా పోయింది.
ఆయా ఘటనల్లో జగన్ రెడ్డి గొప్పగా చెప్పే వాలంటీర్ల ప్రమేయం కూడా ఉంది. ఇన్ని దారుణాలు జరిగినా డీజీపీ ఎందుకు స్పందించడు? ఆడపిల్ల మానానికి రూ.5 లక్షలు, ప్రాణానికి రూ.10 లక్షలు ఖరీదుకట్టే దుస్థితిలో మహిళా కమిషన్, జగన్ రెడ్డి, హోంమంత్రి ఉన్నారు. సమయం, సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడే స్థితిలో హోంమంత్రి ఉన్నారు.
రాష్ట్రంలోని మహిళల పరువు తీసేలా ఏపీ మహిళా కమిషన్ వ్యవహరిస్తోంది. మహిళల రక్షణ, వారి న్యాయం కోసం చంద్రబాబునాయుడు మహిళా కమిషన్ ను ఏర్పాటుచేశారు. కానీ రాష్ట్రమహిళా కమిషన్ ‘జగన్ కమిషన్’ లా మారిపోయింది. మహిళలకు అన్యాయం జరిగితే స్పందించని వాసిరెడ్డిపద్మ, జగన్ రెడ్డిని, ఆయన సతీమణి గురించి మాట్లాడేవారిపై అత్యుత్సాహంతో స్పందిస్తోంది.
చంద్రబాబునాయుడిగారికి, పవన్ కల్యాణ్ కి నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వాసిరెడ్డిపద్మకు సర్వాధికారాలుంటాయా? మహిళలకు న్యాయంచేయడానికి ఆమెకున్న అధికారాలు, హోదా పనికిరావా? వాసిరెడ్డి పద్మకు సర్వాధికారాలుంటే, ఆ అధికారంతో ఆమె జగన్ రెడ్డికే తొలి నోటీసు ఇవ్వాలి. రెండో నోటీసు బూతులు మాట్లాడే మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రులకు ఇవ్వాలి.
గోరంట్ల మాధవ్ అర్థనగ్న ప్రదర్శనలతో రాష్ట్రం పరువు తీసినప్పుడు పద్మకు నోటీసులు గుర్తురాలేదా? వాసిరెడ్డి పద్మ నిజంగా ఆడబిడ్డలకు న్యాయం చేసేదే అయితే, ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పుస్తకం ఇచ్చినప్పుడే స్పందించేది. ఆమెకు తెలిసిందల్లా చంద్రబాబు, లోకేశ్, ప్రతిపక్షాలపై పడి ఏడవడమే.
అవనిగడ్డలో బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. జగన్ రెడ్డిలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, వినరాని బూతులు వింటున్నందుకు నిజంగా ప్రజలు ఇప్పటికే సిగ్గుపడుతున్నారు. కేబినెట్ లో బూతులు మాట్లాడని మంత్రి ఎవరైనా ఉన్నారేమో జగన్ రెడ్డి చెప్పగలడా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డే, పబ్లిక్ మీటింగ్ లో నా వెంట్రుక కూడా పీకలేరంటూ పిచ్చెక్కినట్టు మాట్లాడలేదా? బూతులు మాట్లాడేవారే... వాటి గురించి మాట్లాడటం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం" అంటూ అనిత విమర్శలు చేశారు.