Rahul Gandhi: పాదయాత్ర ముగిసే దాకా గడ్డం గీయొద్దు.. రాహుల్ కు సందేశం పంపిన ఏపీ యువత
- ఏపీసీసీ నేతలతో తన యాత్ర గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ
- ఏపీ యువత ఏం కోరుకుంటున్నారో చెప్పిన మహిళా నేత
- యాత్ర ముగిసేదాకా గడ్డం తీయొద్దనడంపై స్పందించని రాహుల్
- శైలజానాథ్ బొటనవేళ్లు దెబ్బతిన్న వైనాన్ని ప్రస్తావించిన వైనం
- చర్చలో ఉత్సాహంగా కనిపించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన యాత్ర ప్రస్తుతం తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడులో మొదలైన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటుకుని తెలంగాణ చేరింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రకు కాస్తంత విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ... ఏపీలో సాగిన యాత్ర గురించి ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో మంగళవారం పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన మహిళా నేత ఓ ఆసక్తికర అంశాన్ని రాహుల్ ముందు ఉంచారు. జోడో యాత్ర ముగిసే దాకా రాహుల్ గాంధీ గడ్డం గీయొద్దంటూ ఏపీ యువత కోరుతున్నారని ఆమె రాహుల్ కు చెప్పారు. ఈ వినతికి ఔననో, కాదనో ఆన్సర్ ఇవ్వని రాహుల్... చూద్దాంలే అన్నట్లుగా స్పందించారు.
ఇదిలా ఉంటే ఏపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ చేపట్టిన చర్చలో ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, మాజీ ఎంపీ జేడీ శీలం, పార్టీ విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ బొటన వేళ్లు చితికిపోయిన వైనాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ప్రస్తావించారు. మరో నేతను చూపుతూ మీరు ఆది నుంచి యాత్ర వెంటే సాగుతున్నారుగా అని రాహుల్ అనగా... మిగిలిన వారంతా తాము కూడా నడిచామంటూ చెప్పారు. ఈ మాటకు అందరూ తనతో కలిసి నడవలేదంటూ ఏమాత్రం మోహమాటం లేకుండానే చెప్పేశారు. రాహుల్ యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్న విషయాన్ని నేతలంతా చెప్పారు. ఇక పాదయాత్ర ద్వారా ఒక్క పార్టీకే కాకుండా పార్టీకి చెందిన నేతలకు, రాష్ట్రానికి, దేశానికి , అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని రఘువీరారెడ్డి తెలిపారు.