PM Modi: అప్పటి కుర్రాడే ఇప్పుడీ మేజర్.. 21 ఏళ్ల తర్వాత మోదీని కలుసుకున్న యువకుడు
- ప్రధాని కార్గిల్ పర్యటనలో అపురూప దృశ్యం
- మేజర్ తో పాటు మోదీ భావోద్వేగం
- అప్పటి సంగతులను గుర్తుచేసుకున్న ఇరువురు
- పాత ఫొటోతో కలిసి మళ్లీ ఫొటొ తీసుకున్న వైనం
స్కూలులో అందుకున్న బహుమతులను అపురూపంగా దాచుకుంటాం.. ఆ బహుమతిని కలెక్టర్ నుంచో, ఎమ్మెల్యే నుంచో, ముఖ్యమంత్రి చేతుల మీదుగానో అందుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ ఫొటోను ఫ్రేం కట్టించి జాగ్రత్తగా దాచుకుంటాం. అలాంటి చిన్నప్పటి ఫొటోను పెద్దయ్యాక అందులోని ప్రముఖుడితో కలిసి చూస్తే... సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఓ మేజర్ కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో గుజరాత్ సీఎం.. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం వచ్చింది. ఈ అరుదైన సంఘటనకు ప్రధాని మోదీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది.
గుజరాత్ కు చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిక్ స్కూలులో చదువుకున్నారు. 2001 సంవత్సరంలో బాలాచాడి స్కూలులో జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. తర్వాత చదువు పూర్తిచేసుకున్న అమిత్.. భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు. వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూశారు.
ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కార్గిల్ లో పర్యటించారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుంటుండగా.. అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తుచేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అమిత్ తో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి ఫొటోను పట్టుకుని ప్రధాని మోదీ, మేజర్ అమిత్ మళ్లీ ఫొటో దిగారు.