Phil Simmons: ఓటమి భారంతో కోచ్ పదవికి ఫిల్ సిమన్స్ గుడ్ బై
- గ్రూపు దశను దాటలేకపోయిన వెస్టిండీస్ జట్టు
- కేవలం ఒక గెలుపుతో ఇంటి ముఖం
- బాధకు గురి చేస్తోందన్న ఫిల్ సిమన్స్
- ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరకే కోచ్ గా సేవలు
వెస్టిండీస్ జట్టుకు విజయాన్ని అందించలేనప్పుడు కోచ్ గా కొనసాగడంలో అర్థం లేదనుకున్నాడు ఫిల్ సిమన్స్. దీంతో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ క్వాలిఫయింగ్ రౌండ్ ను కూడా దాటలేకపోయని సంగతి తెలిసిందే. గ్రూప్ దశలోనే వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం ఒక విజయం, రెండు అపజయాలతో వెస్టిండీస్ గ్రూపు బీలో చివరి స్థానానికి పరిమితమై ఇంటి బాట పట్టడం తెలిసిందే.
ఈ క్రమంలో ఫిల్ సిమన్స్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చివరిగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వరకే ఫిల్ సిమన్స్ కోచ్ గా తన సేవలను అందించనున్నాడు. ఆ తర్వాత ఈ పదవి నుంచి తప్పుకుంటాడు.
‘‘ఇది నిరుత్సాహకరం. బాధకు గురి చేస్తోంది. మేము తగినంత రాణించలేకపోయాం. ఇప్పుడు మన ప్రాతినిధ్యం లేకుండా టోర్నమెంట్ ను చూడాలి. ఇది గంభీరం. అందుకు అభిమానులు, అనుచరులు అందరినీ నేను తీవ్ర క్షమాపణలు కోరుతున్నాను. ఇదేమీ తాజా ఓటమికి ప్రతి స్పందన చర్య కాదు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కోచ్ పదవి నుంచి దిగిపోయే సమయం ఇప్పుడు వచ్చేసింది’’అని సిమన్స్ పేర్కొన్నాడు.