Virat Kohli: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న శశిథరూర్
- ప్రయాణిస్తే మ్యాచ్‌ను మిస్సవుతానన్న ఉద్దేశంతో వాయిదా వేసుకున్నానన్న శశిథరూర్
- కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసలు
- మేధావి, ప్రామాణికమైన హీరో అంటూ కోహ్లీపై పొగడ్తలు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌ను చూసేందుకు తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి పలు ట్వీట్లు చేసిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గోవా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ప్రసంగించిన తర్వాత షెడ్యూల్ చేసిన విమానాన్ని మ్యాచ్ కోసం రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఆ సమయంలో ప్రయాణిస్తే మ్యాచ్‌ను మిస్సవుతానన్న ఉద్దేశంతోనే విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాతి విమానం రాత్రి 9.55 గంటలకు ఉందని తెలిసినప్పటికీ మ్యాచ్ కోసం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నానన్నారు.
ఈ టోర్నమెంటులోనే అది గొప్ప మ్యాచ్ అని, చూసి థ్రిల్లయ్యానని అన్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శనపైనా ప్రశంసలు కురిపించారు. కోహ్లీ మేధావి అని, ప్రామాణికమైన హీరో అని కొనియాడారు. కాగా, ఒక దశలో ఓటమి బాటలో పయనించిన భారత్‌ను కోహ్లీ, హార్దిక్ పాండ్యా గట్టెక్కించారు. ఆ తర్వాత పాండ్యా అవుటైనప్పటికీ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రపంచంలోని క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. కోహ్లీ ఇన్నింగ్స్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.