Pooja Hegde: మీకు ఏం తెలుసో అదే కథగా రాయండి: 'కాంతార' చిత్రం చూసిన తర్వాత పూజ హెగ్డే స్పందన

Pooja Hegde reviews on Kanatara

  • 'కాంతార' ఓ అద్భుత చిత్రం అని పేర్కొన్న పూజ
  • 'భూత కోల'ను అపూర్వరీతిలో చూపించారని కితాబు
  • 'భూత కోల'ను తాను చిన్నతనంలో చూశానని వెల్లడి
  • దర్శక నటుడు రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం

ఓ చిన్న సినిమాగా విడుదలై అఖండ విజయం అందుకున్న చిత్రం 'కాంతార'. కర్ణాటకలో తప్ప బయటి రాష్ట్రాల వారికి పెద్దగా తెలియని రిషబ్ శెట్టి ఇప్పుడొక పాన్ ఇండియా స్టార్. 'కాంతార'లో హీరో అతనే, ఆ చిత్రానికి దర్శకుడూ అతనే. కొన్ని వారాల కిందట రిలీజైన ఈ కన్నడ చిత్రం రాష్ట్రాల సరిహద్దులు దాటి భాషలకు అతీతంగా అభిమానులను అలరిస్తోంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 

కాగా, 'కాంతార' చిత్రాన్ని అందాలభామ పూజ హెగ్డే వీక్షించారు. సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సినిమాలో చూపించిన 'భూత కోల' ఆచారాన్ని తాను ఎప్పుడో చిన్నతనంలో చూశానని పూజ హెగ్డే గుర్తుచేసుకున్నారు. 'కాంతార' ఇంతటిస్థాయిలో ఆడియన్స్ ఆదరణ పొందుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. 

'కాంతార' సినిమాలో చివరి ఇరవై నిమిషాలు తనకు ఒళ్లు గగుర్పొడిచిందని ఈ కన్నడ బ్యూటీ వివరించారు. నటీనటుల ప్రదర్శన, కొన్ని సన్నివేశాలు తనను కదిలించివేశాయని పేర్కొన్నారు. "రిషబ్ శెట్టీ... భూత కోల ఆచారాన్ని ఎంతో అపూర్వరీతిలో చూపించి సక్సెస్ సొంతం చేసుకున్నావు... భవిష్యత్తులోనూ నువ్వు మరిన్ని విజయాలు అందుకోవాలి" అని పూజ హెగ్డే ఆకాంక్షించారు. 

కాగా, 'కాంతార' చిత్రం కోసం ఎంపిక చేసుకున్న స్టోరీ పాయింట్ పైనా పూజ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "మీకు తెలిసిన దాన్నే కథగా రూపొందించండి. మీ హృదయపు లోతుల్లోంచి వచ్చిన విషయాలనే కథలుగా తెరకెక్కించండి" అని సూచించారు. ఈ మేరకు పూజ హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News