Kadapa District: కడపలో అదృశ్యమైన యువతి కథ విషాదాంతం.. నాలుగు రోజుల తర్వాత బయటపడిన మృతదేహం

Girl Who was missing four days ago Found Dead in Kadapa

  • కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి
  • నిన్న ఉదయం 11 గంటల సమయంలో జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద అనూష మృతదేహం లభ్యం
  • పోలీసులు సకాలంలో స్పందించలేదని బాధిత తల్లిదండ్రుల ఆరోపణ

వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి కథ విషాదాంతమైంది. తాజాగా ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని బి.కొండూరు మండలం మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతుల రెండో కుమార్తె అనూష (19) బద్వేలులోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 20న కళాశాలకు వెళ్లిన అనూష రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో  అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో బద్వేలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న ఉదయం 9 గంటల సమయంలో సిద్ధవటం సమీపంలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద అనూష మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. 

ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఆపై చంపేసి నదిలో విసిరేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వాదనను పోలీసులు కొట్టిపడేశారు. అదృశ్యమైన రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని గత రాత్రి 10 గంటల సమయంలో మైదుకూరు డీఎస్పీ వెల్లడించారు. అయితే, ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని 20న రాత్రి బద్వేలు పట్టణ పోలీసులకు వద్దకు వెళ్తే ఇది తమ పరిధి కాదని వెనక్కి పంపించారని పేర్కొన్నారు. దీంతో వారు బి.కోడూరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెబితే బద్వేలులో అదృశ్యమైంది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారని తెలిపారు. 

చేసేది లేక అదే రోజు రాత్రి 11 గంటలకు బాధిత కుటుంబ సభ్యులు మైదుకూరు డీఎస్పీని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పాపిరెడ్డిపల్లెకు చెందిన గురుమహేశ్వర్‌రెడ్డి అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కుమార్తె బతికేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Kadapa District
YSR Dist
Girl Missing Case
Crime News
  • Loading...

More Telugu News