ISRO: రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆలయంలో ఇస్రో చైర్మన్ పూజలు
- నెల్లూరులో చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న సోమనాథ్
- జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని వెల్లడి
- వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు ప్రయోగాలు
- 108 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు యూకేతో ఒప్పందం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయంలో ఇస్రో చైర్మర్ సోమనాథ్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సోమనాథ్.. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని చెప్పారు. శనివారం అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 అంతరిక్షంలోకి దూసుకెళుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలోనే రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేసినట్లు వివరించారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ప్రస్తుతం 36 ఉపగ్రహాలను పంపిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని ఆయన తెలిపారు.