Amaravati: అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్

Amaravati farmers Maha padayatra stopped for four days

  • పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయం
  • కోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించిన ఐకాస
  • యాత్రకు తాత్కాలిక విరామమేనని ప్రకటన

మహాపాదయాత్రపై అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్రను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకెళతామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. కోర్టుకు సెలవుల నేపథ్యంలో మహాపాదయాత్రకు నాలుగు రోజులు నిలిపేస్తున్నట్లు అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 41వ రోజు రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. రామచంద్రపురం బైపాస్ రోడ్డు సమీపంలో రైతులు బసచేసిన ఫంక్షన్ హాల్ ను పోలీసులు చుట్టుముట్టారు. రైతులను కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకున్నారు. హాల్ లోపలికి ఎవరినీ వదలలేదు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆ కార్డులు ఉన్న 600 మంది రైతులనే యాత్రలో అనుమతించాలని హైకోర్టు ఆదేశాలను పాటించాలని రైతులకు సూచించారు. 

గుర్తింపు కార్డులు చూపించిన వాళ్లను మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తామని, అనుమతిలేని వాహనాలు యాత్రలో కొనసాగేందుకు ఒప్పుకోబోమని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ విషయంపై రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. 

అనంతరం ఐకాస నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, యాత్రను నాలుగు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రలో పాల్గొన్న మహిళా రైతులను పోలీసులు గాయపరిచారని, మహిళలను, రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. యాత్రను అడ్డుకోవాలనే లక్ష్యంతో తమకు అడుగడుగునా పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పారు. దీనిపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించి, యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్లు వివరించారు.

Amaravati
mahapadayatra
farmers protest
Dr BR Ambedkar Konaseema District
  • Loading...

More Telugu News