Bangladesh: చోరీకి వెళ్లిన దొంగ.. దొరికిపోతే చావగొడతారని పోలీసులకు ఫోన్!

Fearing Mob Justice Thief In Bangladesh Calls Cops On Self
  • బంగ్లాదేశ్‌లోని బరిషల్ నగరంలో ఘటన
  • పచారీ దుకాణంలోకి చొరబడిన దొంగ
  • పని పూర్తయ్యే సరికి తెల్లారిపోయిన వైనం
  • దొరికితే చితకబాదేస్తారని పోలీసులకు ఫోన్
చోరీకి వెళ్లిన దొంగ దొరికిపోయి చావుదెబ్బలు తింటానన్న భయంతో పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కోరాడు. బంగ్లాదేశ్‌లోని బరిషల్ నగరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. 40 ఏళ్ల యాసిన్ ఖాన్ బుధవారం తెల్లవారుజామున ఓ పచారీ దుకాణంలోకి చొరబడ్డాడు. పని పూర్తి చేసుకున్న తర్వాత బయటకు రావాలనుకున్నాడు. అయితే, బయటి నుంచి వెలుతురు కనిపించడం, జనం మాటలు వినిపించడంతో తెల్లారిపోయిందని, జనం మార్కెట్‌కు రావడం మొదలైందని గుర్తించాడు. 

అంతే.. అతడి వెన్నులో వణుకు మొదలైంది. తాను కనుక వారి చేతికి చిక్కితే తన వీపు విమానం మోత మోగడం ఖాయమని భయపడ్డాడు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తనను రక్షించాలని వేడుకున్నాడు. వెంటనే దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి దొంగను పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ చీఫ్ అసదుజ్ జమాన్ మాట్లాడుతూ.. నేరం చేసిన వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడం తన పదేళ్ల సర్వీసులో తొలిసారి చూశానని అన్నారు.

మరోవైపు, షాపు వద్దకు పోలీసులు చేరుకున్న కాసేపటికే దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని జొంటు మియా అక్కడేం జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యాడు. ఆ తర్వాత దుకాణం లోంచి పోలీసులు ఓ వ్యక్తితో బయటకు రావడంతో అసలు విషయం అర్థమైందని జొంటు మియా పేర్కొన్నాడు. పట్టుబడిన వ్యక్తి దొంగతనాల్లో ఆరితేరినవాడని, చోరీకి ప్రయత్నించాడనే కారణంతో అరెస్ట్ చేసి జైలుకు పంపామని పేర్కొన్నారు. పోలీసులకు పట్టుబడినా జనం చేతుల్లో చావు దెబ్బలు తినకుండా క్షేమంగా బయటపడినందుకు దొంగ యానిస్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నాడు.
Bangladesh
Barisal city
Thief
Police

More Telugu News