Andhra Pradesh: డిసెంబర్ లోనే జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారు: బొండా ఉమ
- ముందస్తు ఎన్నికలు కావాలని జగన్ ఢిల్లీ పెద్దలను అడుగుతున్నారన్న బొండా ఉమ
- ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
- సీబీఐ, ఈడీ కేసుల రాజీ కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపణ
- వివేకా హత్య కేసును జగన్ నిర్వీర్యం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ చాలా కాలం నుంచే విపక్ష టీడీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే జగన్ ఎన్నికలకు వెళతారంటూ ఆయన అన్నారు. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలు కావాలంటూ జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారని ఆరోపించారు. డిసెంబర్ లోనే జగన్ అసెంబ్లీని రద్దు చేసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకే కాకుండా ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న కారణంగానే జగన్ ముందస్తు ఎన్నికల దిశగా సాగుతున్నారని ఆయన అన్నారు.
తనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో రాజీ కోసం జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని కూడా ఉమ ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును జగన్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వివేకా హత్య కేసు విచారణ తీరుపై షర్మిల తప్పుబట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏటా మెగా డీఎస్సీ వేస్తానన్న జగన్ ఇప్పటిదాకా ఎన్ని డీఎస్సీలు వేశారని ఆయన ప్రశ్నించారు.