Nimmala Rama Naidu: వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డే ప్రధానపాత్ర పోషించాడని సీబీఐ పేర్కొనడంపై జగన్, సజ్జల సమాధానం చెప్పాలి: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu press meet

  • వివేకా హత్యకేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • జగన్, సజ్జలపై నిమ్మల రామానాయుడు విమర్శలు
  • జగన్ చిలుకపలుకులు పలికాడని ఎద్దేవా
  • అవినాశ్ పేరు సీబీఐ చార్జ్ షీట్ లో ఉందని నిమ్మల వెల్లడి

ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకొని వివేకా హత్యకేసు ముద్దాయిల్ని కాపాడడం రాష్ట్రానికే సిగ్గుచేటు అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డే ప్రధానపాత్ర పోషించాడని సీబీఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొనడంపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. హత్యలో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల ప్రమేయం లేదన్న జగన్, సజ్జల... సీబీఐ ఛార్జ్ షీట్ పై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 

వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డే ప్రధాన నిందితుడని సీబీఐ చెబుతుంటే, అసెంబ్లీ సాక్షిగా అతనికి క్లీన్ చిట్ ఇచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అవినాశ్ రెడ్డి తన తమ్ముడని, వివేకానందరెడ్డి తన సొంత చిన్నాన్న అని, అలాంటి వ్యక్తిని తాము ఎందుకు చంపుకుంటామని జగన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చిలుక పలుకులు పలికాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వివేకానందరెడ్డిని హత్యచేసిన వారిని కాపాడటానికి ముఖ్యమంత్రే ప్రయత్నిస్తున్నాడని సీబీఐ అభిప్రాయపడ్డాక కూడా జగన్ రెడ్డి ఆ పదవిలో కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. 

వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల ప్రమేయంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా వెనకేసుకొచ్చాడని నిమ్మల ఆరోపించారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల పేర్లు ఉన్నాక సజ్జల ఏమని సమర్థిస్తాడని ప్రశ్నించారు. హత్యకేసులో అవినాశ్ రెడ్డి పాత్ర లేకుంటే.... సీబీఐ అధికారుల్ని బెదిరించి మరీ శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో కలిసి, అరగంట సేపు ఏకాంతంగా ఎందుకు మాట్లాడాడు? అని నిలదీశారు. 

జగన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులోని సాక్షులకు భద్రత కల్పించలేక పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అప్రూవర్ దస్తగిరి కదలికల వివరాలన్నీ శివశంకర్ రెడ్డి ఫోన్ లో ఉండటం ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు. 

"జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి వివేకా హత్యకేసుని ఎంతగా ప్రభావితం చేస్తున్నారో చెప్పడానికి దస్తగిరి విషయంలో జరిగిన ఘటనలే నిదర్శనం. వివేకా హత్య జరిగినప్పుడు ఘటనా స్థలానికి వెళ్లిన సీఐ శంకరయ్యను అక్కడ సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించాడన్న అభియోగాలతో సస్పెండ్ చేశారు. కానీ జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అతనితో సంప్రదింపులు జరిపి, అతనికి మరలా పోస్టింగ్ ఇచ్చి, ప్రమోషన్ తో సత్కరించారు" అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 

అంతేకాదు, హత్యకేసులో నిందితులుగా ఉన్నవారు కపిల్ సిబాల్ లాంటి నిష్ణాతులైన ఖరీదైన న్యాయవాదులను నియమించుకోగలరా? అని ప్రశ్నించారు. "ముద్దాయిలైన శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి సాధారణ ఉద్యోగులు మాత్రమే, అలాంటివారు దేశంలోనే పేరుమోసిన న్యాయవాదుల్ని తమ తరుపున వాదించడానికి నియమించుకోగలరా? జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి అండ, ఆర్థికబలంతోనే వివేకాహత్య కేసులోని ముద్దాయిలకు అత్యంత ఖరీదైన న్యాయసహాయం లభిస్తోంది" అని వివరించారు.

Nimmala Rama Naidu
Avinash Reddy
CBI
YS Vivekananda Reddy
Jagan
Sajjala Ramakrishna Reddy
  • Loading...

More Telugu News