- ఫ్యాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు రావడమే సిగ్గుచేటన్న యనమల
- జగన్ లో మచ్చుకైనా ప్రజాస్వామ్య లక్షణాలు ఉన్నాయా అని ప్రశ్న
- ఫ్యాక్షనిజాన్ని విస్తరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారని మండిపాటు
అవనిగడ్డలో నిన్న సీఎం జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఫ్యాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు రావడం సిగ్గుచేటని అన్నారు. ఇడుపులపాయలో వేల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జాచేయడమేనా జగన్ రెడ్డి పాటించే సోషలిజమని ప్రశ్నించారు. నగరానికో ప్యాలెస్ (బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, పులివెందుల, తాడేపల్లి) నిర్మాణమే సోషలిజమా? అని అడిగారు. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్లీ రాష్ట్రంలో విస్తరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్న జగన్ రెడ్డి.. సోషలిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్ రెడ్డి ఎంతటి ప్రజాస్వామ్యవాదో ప్రపంచమంతా తెలుసని యనమల అన్నారు. సెక్రటేరియట్ కు వెళ్లడానికే ముఖం చెల్లని వ్యక్తి ప్రజాస్వామ్యవాది అని చెప్పుకోవడాన్ని మించిన కామెడీ మరొకటి లేదని విమర్శించారు. జగన్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా వ్యవహరించే పప్పెట్ మంత్రులు, అద్దె మైకు ఎమ్మెల్యేలే ప్రజాస్వామ్యమా? జగన్ రెడ్డిలో మచ్చుకైనా ప్రజాస్వామ్య లక్షణాలున్నాయా? విలువల గురించి జగన్ రెడ్డి లాంటి వారు మాట్లాడడానికి మించిన బూతు మరొకటి ఉంటుందా? చెల్లెలిని రోడ్ల పాలు చేయడమే విలువలా? కన్న తల్లిని పార్టీ నుండి, ఇంటి నుండి, చివరికి రాష్ట్రం నుండి గెంటేయడమే జగన్ రెడ్డి పాటించే విలువలా? సొంత బాబాయి హంతకులకు కొమ్ము కాయడమే విలువలా? అని ప్రశ్నించారు. మోసం, దగా, దౌర్జన్యాలు, హత్యలతో నిండా మునిగిన జగన్ రెడ్డి మోసాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
నవరత్నాల పేరుతో నిరుపేదలను మోసం చేశారని యనమల అన్నారు. రెండో ఏడాదే అమ్మఒడిని ఎగ్గొట్టిన మోసగాడెవరు? మూడేళ్లలో రైతులకు రూ. 30 వేల కోట్లు ఎగ్గొట్టిన మోస చరిత్ర ఎవరిది? నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిని ఎగ్గొట్టిన మోసగాడెవరు? టీచర్లకు సీపీఎస్ హామీపై మోసం చేసిందెవరు? అన్నా క్యాంటీన్లు మూసివేత మోసం కాదా? అమ్మఒడి పేరుతో ఇచ్చి.. నాన్నబుడ్డితో లాక్కోవడం మోసం కాదా? దశలవారీ నిషేధమని చెప్పి వీధివీధినా బెల్టుషాపులు, కల్తీ మద్యం మోసం కాదా? అని ప్రశ్నించారు. నీ తండ్రి వెంట ఉన్న వారిలో ఒక్కరు కూడా ఇప్పుడు నీ వెంట లేరంటే నువ్వెంత మోసగాడివో ప్రజలకు ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? అని అన్నారు.
బూతుల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించడం మొదలు పెట్టిందే నీవని అన్నారు. నీ వాళ్లు బూతులు మాట్లాడొచ్చు కాని... ఎదుటి వారు తిడితే మాత్రం కోపం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాలను బూతులమయం చేసిందే నీవని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నీవు, నీ పార్టీ మట్టి కొట్టుకుపోక తప్పదని అన్నారు.