Nandyala: విశ్వాసం అంటే ఇదేనేమో! ఆహారం పెట్టిన అమ్మ మరణిస్తే.. కడచూపు కోసం పరుగు తీసిన వానరం!
- నంద్యాల జిల్లా డోన్‌లో ఘటన
- గుండెపోటుతో మరణించిన లక్ష్మీదేవి
- రోజూలానే వచ్చిన వానరం
- అంత్యక్రియల వేళ వాహనం వెంట పరుగులు
తనకు రోజూ ఆహారం అందించే ‘అమ్మ’ మరణిస్తే ఆమెను కడసారి చూసేందుకు ఓ వానరం పడిన తాపత్రయం అందరినీ కంటతడి పెట్టించింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన లక్ష్మీదేవి తన ఇంటి వద్ద బజ్జీల కొట్టు నిర్వహించేవారు. అక్కడికి రోజూ ఓ కోతి వచ్చేది. దానికి ఆమె ఆహారం పెట్టేవారు. దీంతో ఇద్దరి మధ్య చెలిమి పెరిగింది. ఈ క్రమంలో లక్ష్మీదేవి నిన్న గుండెపోటుకు గురై మరణించారు.
కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపటికి ఎప్పటిలానే లక్ష్మీదేవి ఇంటికి చేరుకున్న వానరానికి ఆమె కనిపించకపోవడంతో అల్లాడిపోయింది. చుట్టూ చూసింది. ఇంటి ఆవరణలో చూస్తే ఆమె మరణించి ఉండడం, చుట్టూ జనాలు ఉండడంతో దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత లక్ష్మీదేవి మృతదేహాన్ని వైకుంఠ రథంలో అంత్యక్రియలకు తరలిస్తుండగా వాహనం వెనకే పరుగులు తీసింది. ఈ దృశ్యం అక్కడి వారిని కదిలించింది. లక్ష్మీదేవిపై అది పెంచుకున్న ప్రేమకు అందరూ కరిగిపోయారు.