Team India: టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం
- ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్
- సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్
- అక్టోబరు 23న మ్యాచ్
- మెల్బోర్న్ వేదికగా ఆసక్తికర సమరం
- వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల సమరం జరగనుండడంతో, ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రేమికులు తహతహలాడుతున్నారు.
వరల్డ్ కప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న ఆడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యమిస్తోంది. అయితే అభిమానులకు నిరాశ కలిగించేలా ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వర్షసూచన చేసింది.
అక్టోబరు 23న మెల్బోర్న్ లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షం కురిసేందుకు దాదాపు 95 శాతం అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వర్షం కురవొచ్చని వివరించింది. 4 నుంచి 10 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇప్పుడు వర్షసూచనతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.