Mamata Banerjee: సచిన్ టెండూల్కర్ కు అన్యాయం జరిగినా నేను ఇలాగే మాట్లాడతా: మమతా బెనర్జీ
- బీసీసీఐ అధ్యక్షుడిగా ముగిసిన గంగూలీ పదవీకాలం
- మరోమారు అవకాశం ఉన్నా... బోర్డులో వ్యతిరేకత
- గంగూలీకి అన్యాయం జరిగిందంటున్న మమత
- ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు అంటూ ఆగ్రహం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి సౌరవ్ గంగూలీని అవమానకరరీతిలో సాగనంపారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎలుగెత్తారు. సౌరవ్ గంగూలీని ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఎందుకు పంపించలేదని నిలదీశారు. బోర్డు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా గంగూలీని ఎందుకు అడ్డుకున్నారు... క్రికెట్ బోర్డులో ఎవరి ప్రయోజనాలనైనా కాపాడేందుకే ఇలా చేశారా? అని ప్రశ్నించారు.
గంగూలీని ఐసీసీకి పంపాలని తాను ఎంతోమంది బీజేపీ నేతలతో మాట్లాడినా, వారు అందుకు అంగీకరించలేదని మమత ఆరోపించారు. గంగూలీని కావాలనే క్రికెట్ బోర్డుకు దూరం చేశారని విమర్శించారు. ఇలాంటి రాజకీయ ప్రతీకారాల పట్ల సిగ్గుపడాలని బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకవేళ సచిన్ టెండూల్కర్ కు అన్యాయం జరిగినా తాను ఇలాగే స్పందిస్తానని దీదీ స్పష్టం చేశారు.
ఇటీవలే ఆమె ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ ను నియమించినప్పుడు గంగూలీ గుర్తుకురాలేదా? అంటూ మమత విమర్శలను తిప్పికొట్టారు.