Visakhapatnam: విశాఖ విమానాశ్రయం ఘటన.. ఇద్దరు సీఐలపై వేటు
- కంచరపాలెం, ఎయిర్‌పోర్టు సీఐలను వీఆర్‌కు పంపిన ప్రభుత్వం
- బందోబస్తు వైఫల్యం కారణంగానే వేటు అంటూ వార్తలు
- అలాంటిదేమీ లేదంటున్న ఉన్నతాధికారులు
విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద ఈ నెల 15న జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రభుత్వం ఇద్దరు సీఐలపై బదిలీ వేటువేసింది. మంత్రులు ఈ నెల 15న నగరానికి వచ్చిన సందర్భంగా విమానాశ్రయం వద్ద విధుల్లో ఉన్న కంచరపాలెం సీఐ పీవీఎస్ఎన్ కృష్ణారావు, ఎయిర్‌పోర్టు స్టేషన్ సీఐ ఉమాకాంత్‌లను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. వారికి పోస్టింగులు కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు పంపింది. ఈ ఇద్దరు సీఐలను విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి విశాఖ రేంజికి సరెండర్ చేసింది.
విమానాశ్రయం వద్ద ఈ ఇద్దరు సీఐలు బందోబస్తులో ఉన్నప్పుడే ఘర్షణలు తలెత్తాయి. బందోబస్తు వైఫల్యమే ఘర్షణకు కారణమని భావించిన ఉన్నతాధికారులు వారిపై వేటు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నతాధికారుల వాదన మరోలా ఉంది. బదిలీ అయిన ఇద్దరు సీఐలు చాలాకాలంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తుండడం వల్లే బదిలీ చేశామని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.