Allu Aravind: 'గీత ఆర్ట్స్' లో గీత ఎవరంటే..!: అల్లు అరవింద్
- గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్
- గీత ఎవరనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశం
- 'ఆలీతో సరదాగా'లో ఇదే అంశంపై నడిచిన టాపిక్
- అసలు విషయం బయటపెట్టిన అల్లు అరవింద్
'గీత ఆర్ట్స్' నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. బలమైన కథాకథనాలు .. కొత్తదనం కలిగిన సినిమాలు ఈ బ్యానర్లో వస్తాయనే ఒక నమ్మకం జనంలో ఉంది. బ్యానర్ చూసి జనం థియేటర్లకు వెళ్లే జాబితాలో గీత ఆర్ట్స్ కూడా ఉంటుంది. అయితే అసలు ఈ 'గీత' ఎవరు? అల్లు ఫ్యామిలీలోనే 'గీత' అనే పేరు కలిగినవారు ఎవరూ లేరు కదా, మరి ఎవరి పేరుతో ఈ సంస్థను స్థాపించినట్టు? అనే ఒక కుతూహలం చాలామందిలో ఉంది. ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అల్లు అరవింద్ కి ఎదురైంది.
అందుకు ఆయన స్పందిస్తూ .. 'గీత' అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందికి ఉంది. కానీ నిజానికి 'గీత ఆర్ట్స్' అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్ ను పెట్టింది మా నాన్నగారు. 'గీత'లో ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాకి కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే .. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. 'గీత'కి దగ్గరగా ఉండటం వలన 'గీత' ఆర్ట్స్ అని పెడదామని నాన్నగారు అనడం .. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది.
అయితే నాకు 'గీత' అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండటం సత్యం .. నా బ్యానర్ కి 'గీత ఆర్ట్స్' అనే పేరు ఉండటం సత్యం. అయితే ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. ఇది కలిపేసి మాట్లాడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్. 'పెళ్లి తరువాతైనా నిర్మల ఆర్ట్స్ అనే పేరును పెట్టొచ్చుగదా' అని అలీ నవ్వుతూ అడగడంతో, అప్పటికే ఆ బ్యానర్ నుంచి సూపర్ హిట్లు ఇచ్చి ఉండటం వలన మార్చడం ఎందుకని వదిలేశాం" అంటూ అల్లు అరవింద్ నవ్వేశారు.