Muslim Girl: ముస్లిం బాలికలు మేజర్ కాకుండానే వివాహానికి అర్హులా..?: తేల్చనున్న సుప్రీంకోర్టు
- రజస్వల అయిన బాలిక వివాహానికి అర్హురాలేనంటున్న ముస్లిం పర్సనల్ లా
- దీని ఆధారంగానే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు
- దీనిపై సుప్రీంకోర్టులో సవాలు
రజస్వల అయిన ముస్లిం బాలిక వివాహం చేసుకోవడానికి అర్హురాలేనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. 16 ఏళ్ల ముస్లిం మైనర్ బాలిక వివాహ బంధంలోకి ప్రవేశించొచ్చంటూ ఇటీవలే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్ సీపీసీఆర్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం సీనియర్ అడ్వొకేట్ అయిన ఆర్ రాజశేఖర్ రావును ఈ కేసులో అమికస్ క్యూరీగా నియమించింది. ఈ కేసులో ధర్మాసనానికి ఆయన సాయం చేయనున్నారు. బాలల హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. దీన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంటూ బాల్య వివాహాల నిషేధం, పోస్కో చట్టాలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
దీంతో ఈ అంశంలో తాము వాదనలు వింటామన్న ధర్మాసనం విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. ముస్లిం పర్సనల్ లా కింద రజస్వల అయిన బాలిక వివాహ వయసుకు వచ్చినట్టేనంటూ హైకోర్టు ఓ ముస్లిం జంటకు రక్షణ కల్పించడం కేసు నేపథ్యంగా ఉంది.