Apple cider vinegar: యాపిల్ సైడెర్ వెనిగర్ రెండు వైపులా పదునున్న కత్తి వంటిది!
- తక్కువ మోతాదులో తీసుకోవడానికి పరిమితం కావాలి
- ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు వాడితే పలు సమస్యలు
- అలర్జీ, అజీర్తి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి
యాపిల్ సైడెర్ వెనిగర్ తో లాభాల గురించి అందరికీ తెలియకపోవచ్చు. ఇటీవలి ప్రచారం కారణంగా దీని పట్ల ఆసక్తి ఏర్పడుతోంది. లాభాలే కాదు, దీని కారణంగా అనర్థాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇది నిజంగా ఆరోగ్యానికి ఏ మేరకు ప్రయోజనం అనే వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
యాపిల్ జ్యూస్ ను ఈస్ట్ తో ఫెర్మెంటేషన్ చేసి యాపిల్ సైడెర్ వెనిగర్ తయారు చేస్తారు. యాపిల్ లో ఉన్న షుగర్ ను ఈస్ట్ ఆల్కహాల్ గా మారుస్తుంది. తర్వాత బ్యాక్టీరియాను కలుపుతారు. ఈ ఆల్కహాల్ ను అసెటిక్ యాసిడ్ గా మారుస్తారు. ఇందులో యాసిడ్స్ తో పాటు విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. జంతువులు, మనుషులపై చేసిన ప్రయోగాల్లో బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు, బ్లడ్ షుగర్ స్థాయి తగ్గించేందుకు ఏసీవీ ఉపయోగపడుతుందని తెలిసింది. కానీ, రోజువారీగా దీన్ని ఎంత కాలం పాటు వాడుకోవచ్చు? ఏళ్ల తరబడి వాడితే వచ్చే అనారోగ్య సమస్యలపై తగినంత అధ్యయనం జరగలేదు.
కొలెస్ట్రాల్ పై ఆయుధం..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్ ను యాపిల్ సైడెర్ వెనిగర్ (ఏసీవీ) తగ్గిస్తుంది. మనుషులు, జంతువుల్లో ఇందుకు సంబంధించి చేసిన ప్రయోగాలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చాయి.
యాంటీ మైక్రోబయల్
సూక్ష్మ జీవులను చంపేసే శక్తి ఏసీవీకి ఉంది. ఈ-కొలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను సైతం ఇది తగ్గించగలదని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి.
బరువు తగ్గడం..
ఏసీవీకి, బరువు తగ్గడానికి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ఏసీవీని తీసుకున్నప్పుడు జీర్ణాశయం ఖాళీ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీనివల్ల మరింత గ్లూకోజ్ ను శరీరం ఉపయోగించుకుంటుంది. ఇదంతా పరోక్షంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
రిస్క్ లు..
గర్భంతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు ఏసీవీ తీసుకోవడం సురక్షితమని ఇంకా తేలలేదు. ఏసీవీకి యాసిడ్ గుణం ఎక్కువ. పళ్ల ఎనామిల్ ను దెబ్బతీయగలదు. తగినంత పలుచన చేయకుండా తాగితే, పళ్ల ఎనామిల్ పోయి పుచ్చులకు దారితీస్తున్నట్టు పరిశోధకులు ఎలుకలపై పరిశోధనలో భాగంగా గుర్తించారు. అసిడిటీ గుణం ఎక్కువ కనుక నీటితో డైల్యూట్ చేసి తీసుకోవాలి. లేదంటే గొంతులోనూ అసౌకర్యం అనిపించొచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఏసీవీ వేసుకుని ఆహారానికి 15-20 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి.
కొందరికి ఏసీవీ కారణంగా అజీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అజీర్ణం వల్ల ఆకలి, తీసుకునే ఆహార పరిమాణం తగ్గిపోతుందని గుర్తించారు. రోజులో 25 గ్రాముల పరిమాణం మేర తీసుకునే వారు ఆకలి తగ్గిపోయినట్టు చెప్పారు. ఏసీవీని అధిక మోతాదులో, దీర్ఘకాలం పాటు తీసుకుంటే రక్తంలో పొటాషియం తగ్గిపోయి, బోన్ లాస్ సమస్య ఏర్పడుతున్నట్టు ఓ అధ్యయనం గుర్తించింది. 28 ఏళ్ల మహిళ రోజూ డైల్యూట్ చేసిన ఏసీవీ 250 ఎంఎల్ ను ఆరేళ్ల పాటు తీసుకోగా, తక్కువ పొటాషియం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆస్టియోపొరాసిస్ సమస్య కూడా ఏసీవీ వల్ల వస్తుంది.
ఈ జాగ్రత్తలు
ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్ల ఏసీవీని గ్లాసు నీటిలో వేసుకుని తాగడం మొదలు పెట్టొచ్చు. దీని తర్వాత నోటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏసీవీ తీసుకోవడం మొదలైన తర్వాత జీర్ణ సమస్యలు కనిపిస్తే రోజులో ఒక స్పూన్ కు పరిమితం కావాలి. అలర్జీ సమస్యలు కనిపిస్తే తీసుకోవడం ఆపేసి వైద్యులను సంప్రదించాలి.