Jayaprakash Narayan: వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తున్న లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ
- విజయవాడలో లోక్ సత్తా పార్టీ సమావేశం
- జేపీ లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయం
- ఆయనను ప్రజలు ఆదరించాలన్న పార్టీ కమిటీ
- కలిసివచ్చే వారితో కొత్త వేదిక నిర్మిస్తామని వెల్లడి
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధినేత జయప్రకాశ్ నారాయణ గతంలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తర్వాత కాలంలో ఆయన మరోసారి అసెంబ్లీకి వెళ్లలేకపోయారు.
ఈ నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి బరిలో దిగాలని జయప్రకాశ్ నారాయణ నిర్ణయం తీసుకున్నారు. అందుకు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపింది. అయితే, జేపీ ఈసారి ఎంపీగా పోటీ చేస్తారని లోక్ సత్తా రాష్ట్ర కమిటీ వెల్లడించింది.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాల సాధన కోసం ఏపీ నుంచి జయప్రకాశ్ నారాయణ పోటీ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. తమతో కలిసివచ్చే వారితో కలిసి నూతన ఫ్రంట్ కు రూపకల్పన చేస్తామని, కలిసి పోటీ చేస్తామని వెల్లడించింది. అభివృద్ధి కోసం తపించే జేపీ వంటి వ్యక్తులను ప్రజలు ఆదరించాలని లోక్ సత్తా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఇవాళ విజయవాడలో లోక్ సత్తా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం, పార్టీ బలోపేతం, జేపీ లోక్ సభ అభ్యర్థిత్వం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.