Dopamine: శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే డోపమైన్ ను పెంచే ఏడు మార్గాలు ఇవిగో..
- సరైన నిద్ర, మంచి ఆహారంతో శరీరంలో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయన్న నిపుణులు
- అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచనలు
- సంగీతం వినడం, వ్యాయామంతోనూ ప్రయోజనం ఉంటుందని వెల్లడి
కొందరు ఎప్పుడు చూసినా చురుగ్గా ఉంటుంటారు. ఏదైనా వేగంగా చేసేస్తుంటారు. ఉత్సాహంగా కనిపిస్తారు. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుండటంతోపాటు శరీరంలో డోపమైన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. డోపమైన్ అనేది మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్ అని.. అది న్యూరోట్రాన్స్ మిటర్‌గా పనిచేస్తుందని అంటున్నారు. మెదడుతోపాటు శరీరం మొత్తం పనితీరుకు తగినంత డోపమైన్ స్థాయిలు చాలా ముఖ్యమని వివరిస్తున్నారు.
ఎన్నో కీలక ప్రయోజనాలు డోపమైన్ తోనే..
ఈ హార్మోన్ కదలిక, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సరైన మానసిక స్థితి, ఉత్సాహం వంటి లక్షణాలను మెరుగుపర్చుతుందని స్పష్టం చేస్తున్నారు. దీని లోపం వల్ల డిప్రెషన్, మతిమరపు, నిరుత్సాహం, పార్కిన్సన్స్ వ్యాధి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తగినంత డోపమైన్ స్థాయి ఉండేందుకు, శరీరంలోనే డోపమైన్ ఉత్పత్తిని పెంచుకునేందుకు శాస్త్రవేత్తలు పలు మార్గాలను సూచిస్తున్నారు.
నచ్చిన సంగీతం వినడం
మనకు నచ్చిన సంగీతం వినడం ద్వారా శరీరంలో డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుందని, మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఇంతకుముందే పలు పరిశోధనల్లో గుర్తించారు. సంగీతంలోని రిథమ్ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మెదడులో రివార్డ్ యాక్టివిటీ (శరీరానికి విశ్రాంతినిచ్చే చర్యల)ను పెంచుతుంది. దీనికి కారణం శరీరంలో డోపమైన్ ఉత్పత్తి పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ (నాడీ వ్యవస్థ, అవయవాలు చచ్చుబడిపోవడం) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు సంగీతం వినడం ద్వారా కదలికలు మెరుగవుతాయని కూడా పరిశోధనలు గుర్తించాయని వివరిస్తున్నారు.
తగిన ఆహారం తీసుకోవడం
మనం తినే ఆహారం మన శరీరంతోపాటు మనసునూ ప్రభావితం చేస్తుందన్నది ఇప్పటికే తెలిసిన విషయం. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరంలో ‘హ్యాపీ హార్మోన్ల (ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించే హార్మోన్ల)’ ఉత్పత్తిని పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లూటెనస్ (గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి వేగంగా శక్తినిచ్చే) ఆహారం వల్ల శరీరంలో సెరటోనిన్ విడుదల అవుతుందని.. అది ఉత్సాహాన్ని ఇస్తుందని వివరిస్తున్నారు. ఇక అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు డోపమైన్ ఉత్పత్తిని పెంచుతాయని చెబుతున్నారు. తక్షణ ఫలితం కోసమైతే... కాఫీ, టీ వంటి అధిక కెఫీన్ ఉన్న డ్రింక్స్ తో ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
మంచి నిద్ర అవసరం
శరీరానికైనా, మనసుకు అయినా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. బాగా నిద్రపోయినప్పుడు మెదడు తనను తాను రీచార్జి చేసుకుంటుంది. అంతేకాదు మంచి రాత్రి నిద్ర వల్ల శరీరంలో డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువ సమయం నిద్రలేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం వల్ల డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల మానసికంగా ప్రతికూలతలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం
కొన్ని ఆహార పదార్థాల తరహాలోనే వ్యాయామం కూడా శరీరంలో డోపమైన్, ఇతర ‘హ్యాపీ హార్మోన్ల’ ఉత్పత్తిని పెంచుతుందని పరిశోధనల్లో గుర్తించారు. వ్యాయామం తర్వాత వెంటనే హ్యాపీ హర్మోన్లు విడుదలయ్యే ప్రక్రియను ‘రన్నర్స్ హై’ అని కూడా పిలుస్తుండటం గమనార్హం. ఈ ‘రన్నర్స్ హై’ కారణంగా రోజంతా శక్తివంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కాహాల్, డ్రగ్స్ కు దూరం
సాధారణంగా ఆల్కాహాల్, ఇతర డ్రగ్స్ శరీరంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా డోపమైన్, ఇతర హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని తరచూ వినియోగించడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్ల సహజ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆల్కాహాల్, డ్రగ్స్ కు దూరంగా ఉండటం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని వివరిస్తున్నారు.
ధ్యానం చేయడం
మానసిక, శారీరక ఆరోగ్యానికి ధ్యానం తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం డోపమైన్ ఉత్పత్తిని పెంచడమేగాకుండా మెరుగైన జ్ఞాపకశక్తికి, ఏకాగ్రత, ఒత్తిడి నియంత్రణ, పలు మానసిక సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
తోటివారితో కలవండి
మనుషులు సామాజిక జీవనానికి అనుగుణంగా అభివృద్ధి చెందారని.. తోటివారితో కలవడం వల్ల మానసిక స్థితి బాగుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాట్లాడటం, అనుభూతులు పంచుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి కూడా శరీరంలో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతాయని పేర్కొంటున్నారు.
వైద్యుల సలహా కూడా తీసుకోండి
ఏ వ్యక్తి అయినా నిరాశగా, స్తబ్దుగా, నిరుత్సాహంతో కూడి ఉండటానికి పలు శారీరక, మానసిక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వైద్యులను కలిసి మాట్లాడాలని.. అవసరమైతే తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆహారంలోగానీ, జీవన విధానంలోగానీ మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.