Boora Narsaiah Goud: టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!

Boora Narsaiah Goud resigns to TRS

  • కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపిన నర్సయ్య గౌడ్
  • పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేశానని వ్యాఖ్య
  • ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని విమర్శ

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు పంపారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన టీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు. కానీ, టికెట్ ను ప్రభాకర్ రెడ్డికి ప్రకటించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న ఆయన భేటీ అయినట్టు సమాచారం. 

మరోవైపు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... పార్టీలో అవమానాలను భరించలేకే రాజీనామా చేశానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. మాజీ ఎంపీ అయిన తనను మునుగోడు ఎన్నిక విషయంలో అసలు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అడగడమే తప్పయితే... పార్టీలో ఉండటం కూడా అనవసరమని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, విద్య రంగాల్లో బీసీలు వివక్షకు గురవుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News