: వాచ్ లాంటి కంప్యూటర్లు రానున్నాయోచ్!
మనం ఎక్కడికైనా వెళ్లాలంటే కంప్యూటర్‌ను మనతోబాటు మోసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదే కంప్యూటర్ మనం చేతికి పెట్టుకునే వాచ్‌లా ఉంటే... అప్పుడు ఎంచక్కా ఇలా చేతికి పెట్టేసుకుని అలా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా కంప్యూటర్ల తయారీపై ప్రముఖ సంస్థ యాపిల్ దృష్టి సారించింది. వాచీలాంటి కంప్యూటర్లను వాడడానికి ఎంతో దూరం లేదని యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ అంటున్నారు.
కానీ, ఇప్పటికే కళ్లజోడులా ధరించే గూగుల్ గ్లాస్‌లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వీటిపై యువత పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. వీటి ధర కూడా రూ.84 వేల వరకూ ఉంది. ఈ కళ్లజోడు వై-ఫై ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అంతేకాదు... ఈ కళ్లజోడును మొబైల్‌కు కూడా అనుసంధానం చేయవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉన్న గూగుల్ గ్లాస్‌లు మార్కెట్లోకి విస్తృతంగా వెళ్లలేకపోయాయి. అయితే త్వరలో రానున్న ముంజేతికి ధరించే కంప్యూటర్లు మాత్రం అందరిని దృష్టినీ ఆకర్షిస్తాయని, ప్రస్తుతం యువత వాచ్‌లపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని, ఈ కొత్తరకం కంప్యూటర్లు వస్తే మాత్రం యువతకు వాచ్ పెట్టుకోవడంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుందని టిమ్ కుక్ అంటున్నారు. యాపిల్ కంపెనీ రూపొందించే ఈ కొత్తరకం 'ఐవాచ్'లు 2014 నాటికి మార్కెట్లోకి వస్తాయని అందరు భావిస్తున్నారు.