Eyebrows: మన కనుబొమ్మల ఆకృతే మనమేంటో చెప్పేస్తుందట!

Shape of eyebrows reveals about your personality

  • దూరంగా, దగ్గరగా కలిసిపోయినట్టు ఉండే ఆకృతులను బట్టి అంచనాలు
  • కనుబొమ్మలు మందంగా ఉన్నవారికి, సన్నగా ఉన్నవారికీ తేడాలు
  • ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతున్న నిపుణులు
  • కచ్చితమా, కాదా? అన్నది ఏమోగానీ సరదాగా ఉందంటున్న నెటిజన్లు

ఎవరిదైనా ముఖం చూడగానే వారి కళ్లపై దృష్టి పడుతుంది. కళ్లు, ఆ కళ్లపై ఉండే కనుబొమ్మలతోనే ముఖానికి ఆకర్షణీయత వస్తుంది. కొందరికి సన్నగా హరివిల్లులా వంగిన కనుబొమ్మలు ఉంటే.. మరికొందరికి మందంగా చతురస్రాకారంగా కూడా ఉంటుంటాయి. కాస్త అందం విషయంలో అయితే ఓకేగానీ.. కనుబొమ్మల గురించి ఇంకా మాట్లాడుకునేదేం ఉందని అనుకుంటున్నారా? కానీ కనుబొమ్మల ఆకృతి, పరిమాణాన్ని బట్టి వ్యక్తుల తత్వం, వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇదెంత వరకు కచ్చితమోగానీ వారు చెబుతున్న అంశాలు మాత్రం సరదాగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం..

1. దూరంగా ఉండే కనుబొమ్మలు
కనుబొమ్మల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమగల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులభంగా ప్రభావితం అవుతారు. ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళనల కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఎలాంటి ప్లాన్‌ లేకుండానే పనులు, నిర్ణయాల్లో ముందుకు వెళతారు.

2. బాగా వంగిన కనుబొమ్మలు ఉన్నవారు
కనుబొమ్మలు బాగా వంగినట్టుగా ఉన్నవారు ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ఉంటారు. సహనం తక్కువ, నాటకీయత ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంతా వారిని గుర్తించాలని కోరుకుంటారు. అలా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. జీవితంలోకి, మనసులోకి ఎవరినైనా రానిచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

3. గీతలా నేరుగా ఉండే కనుబొమ్మలు
దాదాపు గీతలా, నేరుగా ఉండే కనుబొమ్మలు ఉన్నవారు తార్కికంగా ఆలోచించే లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిస్తారు. వీరు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుతారు. ఒకదాని ప్రభావం మరోదానిపై పడనివ్వరు. మొండిగా, సూటిగా వ్యవహరిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. వారి సంబంధ, బాంధవ్యాలలో భావోద్వేగ అలజడులు తక్కువగా ఉంటాయి.

4. కలిసిపోయి ఉన్న కనుబొమ్మలు
ఉమ్మడి కనుబొమ్మలు ఉన్నవారు ప్రపంచం, సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వీరు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు. వీరి గురించి వీరు వ్యక్తీకరించుకునే అవకాశాన్ని వదులుకోరు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ. కళా రంగాల్లోకి వెళ్లే అవకాశం తక్కువ. వీరికి దయాగుణం ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని క్షమించకుండా కఠినత్వం వహిస్తారు. వీరికి నచ్చని అంశాలపై త్వరగా మనస్తాపం చెందుతారు, చిరాకుపడతారు.

5. మందంగా ఉన్న కనుబొమ్మలు
మందమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛాజీవులు. ఏదైనా ఎలా ఉన్నదాన్ని అలా ప్రేమిస్తారు. లోపాలు వెతకరు. ఇతరులు వీరి గురించి ఏమనుకుంటారోనని చింతించరు. వీరి మీద వీరికి విశ్వాసం ఎక్కువ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం, ఉద్వేగాలపై కాకుండా తార్కికంగా ఆలోచనలు చేస్తారు. అయితే ఏదైనా వీరికి అడ్డువస్తే మాత్రం తీవ్రంగా విసుగు చెందుతారు.

6. సన్నని కనుబొమ్మలు ఉన్నవారు
సన్నని కనుబొమ్మలు ఉన్నవారు అతిగా ఆలోచిస్తారని.. వారిలో ఆత్మ విశ్వాసం పాళ్లు కాస్త తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఆత్మవిశ్వాసం బాగానే ఉన్నట్టుగానే వీరు భావిస్తుంటారని.. ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో తర్జనభర్జన పడతారని, ఇతరుల సాయం తీసుకుంటారని వివరిస్తున్నారు. ఏదైనా అంశం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న దానిపై బాగా ఎక్కువ దూరం ఆలోచిస్తారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News