Russia: ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవడమంటే.. మూడో ప్రపంచ యుద్ధాన్ని కొని తెచ్చుకోవడమే: రష్యా హెచ్చరిక
- ఉక్రెయిన్‌లోని నాలుగు భాగాలను కలిపేసుకున్న రష్యా
- నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు
- అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలన్న రష్యా
- ఉక్రెయిన్‌కు సాయం చేసే దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హెచ్చరిక
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా నెలల తరబడి ఆ దేశంపై యుద్ధం చేస్తూనే ఉంది. ఇటీవల మళ్లీ జోరు పెంచి భీకర దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు, ‘నాటో’లో చేరేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా తీవ్ర హెచ్చరిక చేసింది. ఉక్రెయిన్‌ను కనుక నాటోలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెన్డిక్టోవ్ హెచ్చరికలు జారీ చేశారు. నాటోలో రష్యాను చేర్చుకోవడం అంటే అది మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరి తెచ్చుకోవడమేనని, ఆ విషయం ఉక్రెయిన్‌కు కూడా తెలుసని అన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్‌కు సాయం చేసే పశ్చిమ దేశాలను కూడా యుద్ధంలో భాగస్వాములుగా పరిగణిస్తామని అన్నారు.
ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు భాగాలను రష్యా తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాటోలో చేరుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమను త్వరగా ఆ సైనిక కూటమిలోకి చేర్చుకోవాలని కోరారు. ఇది రష్యాకు ఆగ్రహం తెప్పించింది. అందులో భాగంగానే ఈ ప్రకటన చేసింది. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. గత రాత్రి జనావాసాలపై ఆత్మాహుతి డ్రోన్ దాడిచేసింది. ఉక్రెయిన్ సైన్యం కూడా దీనిని నిర్ధారించింది. కాగా, గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని 40 ప్రాంతాలపై రష్యా దాడులు చేసింది. ప్రతిగా ఉక్రెయిన్ కూడా రష్యాకు చెందిన 25 లక్ష్యాలపై 32 దాడులు చేసింది.