Andhra Pradesh: ఏపీ మంత్రి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు
![maouists warns ap minister Seediri Appalaraju](https://imgd.ap7am.com/thumbnail/cr-20221013tn6348166d123bb.jpg)
- పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్పలరాజు
- జగన్ కేబినెట్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా కొనసాగుతున్న వైనం
- పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మావోయిస్టుల వార్నింగ్
- మావోయిస్టుల లేఖలోని అంశాలతో తనకు సంబంధం లేదన్న మంత్రి
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో నిషేధిత విప్లవ సంస్థ నుంచి ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మంత్రికి మావోయిస్టుల నుంచి వార్నింగ్ లేఖ వచ్చింది. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను మావోయిస్టులు హెచ్చరించారు.
ఈ మేరకు మావోయిస్టుల నుంచి మంత్రికి హెచ్చరికలు జారీ అయ్యాయన్న వార్తలు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే... మావోయిస్టుల లేఖలోని అంశాలతో తనకేమీ సంబంధం లేదని అప్పలరాజు తెలిపారు.
ఇటీవల అప్పలరాజు వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదురు కావడం గమనార్హం.