Kala Venkata Rao: శాఖలు మారుస్తాను... పీకేస్తానని ముఖ్యమంత్రి బెదిరించాకనే మంత్రులు రైతుల పాదయాత్రపై పడ్డారు: కళా వెంకట్రావు
- కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
- విశాఖలో గర్జన సభకు వైసీపీ నిర్ణయం
- రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రులు విమర్శనాస్త్రాలు
- తీవ్రస్థాయిలో స్పందించిన కళా వెంకట్రావు
టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించి అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చి పబ్బం గడుపుకోవడానికే ప్రభుత్వం రైతుల పాదయాత్రపై దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు.
జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పనిగట్టుకొని మరీ ఉత్తరాంధ్రవాసుల్ని, అమరావతి రైతులపైకి ఉసిగొల్పుతున్నట్టు విమర్శించారు. హైకోర్టు అనుమతితో సాగుతున్న యాత్రను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని తెలిసికూడా మంత్రులు ధర్మాన, బొత్స, అమర్నాథ్, మరికొందరు పదవుల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.
"శాఖలు మారుస్తాను... పీకేస్తానని ముఖ్యమంత్రి బెదిరించాకనే మంత్రులు రైతుల పాదయాత్రపై పడ్డారు. మంత్రుల వ్యాఖ్యలపై ఉత్తరాంధ్ర ప్రజలంతా సంయమనం వహించాలి. జగన్ రెడ్డి, మంత్రుల వ్యాఖ్యల పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.
"కేంద్రంతో దోస్తీ చేస్తున్న జగన్ రెడ్డి, రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏంసాధించాడు? పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఉద్యమాలు, గర్జనలు నిర్వహించి రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఉత్తుత్తి పథకాలతో ఊదరగొడుతున్నారని ప్రజలకు అర్థమైంది. వారిని దారిమళ్లించడానికే జగన్ రెడ్డి, అండ్ కో రైతుల పాదయాత్రపై విషం చిమ్ముతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు తెలియకూడదనే మంత్రులు అమరావతి యాత్రపై పడ్డారు. విశాఖపట్నంలోని ప్రభుత్వభూములు, ఆస్తుల్ని అప్పులకోసం తనఖాపెట్టారు. అప్పులకోసం దేశంలో ఏ ప్రభుత్వం దిగజారనంతగా జగన్ ప్రభుత్వం అథమస్థితికి దిగజారింది. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మూడేళ్లలో ఎన్నినిధులు ఖర్చుపెట్టారు? మూడుజిల్లాల్లోని అధికారుల జీతభత్యాలకు కూడా సరిపోని నిధులు మూడేళ్లలో జగన్ రెడ్డి విదిల్చాడు.
భావనపాడు పోర్టు ఏమైందో ప్రజలకు చెప్పండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంగతేంటి? ఎలాంటి లాలూచీల కారణంగా కేంద్రంనుంచి ఏమీ సాధించలేకపోతున్నారో చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏంచేశారు? ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కేంద్రం ఇస్తుందన్న రైల్వేజోన్ సాధనకు మూడున్నరేళ్లలో ఏంచేశారు?
హైకోర్టు అనుమతితో జరుగుతున్న పాదయాత్రపై మంత్రుల్ని ఉసిగొల్పడం కోర్టు ధిక్కారం కాదా? ప్రభుత్వ వైఫల్యాలు తెలియకూడదనే మంత్రులు అమరావతి యాత్రపై పడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మానప్రసాదరావు, అమర్నాథ్ తోపాటు రోజుకోమంత్రి దండయాత్రకు వస్తున్నారు. మూడు రాజధానుల పేరుచెప్పి మూడేళ్లయినా, ఎక్కడైనా జగన్ అండ్ కో ఏమైనా అభివృద్ధిచేశారా?
న్యాయంగా సాగుతున్న రైతుల పాదయాత్రపై విరుచుకు పడుతున్న మంత్రులు, జగన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకు ఏం ఒరిగిందో చెప్పాలి. ఉత్తరాంధ్రలో లక్ష ఎకరాలు కొన్నారన్న సమాచారంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించరు? వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి బినామీలు, అనుచరుల కింద ఎన్ని భూములున్నాయో తేల్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?” అని కళా వెంకట్రావు నిలదీశారు.