Munugodu: మంటల్లో చండూరు కాంగ్రెస్ కార్యాలయం... రోడ్డుపై బైఠాయించిన పాల్వాయి స్రవంతి

Fire erupts in Munugodu Congress party office

  • త్వరలో మునుగోడు ఉప ఎన్నిక
  • ముమ్మరంగా ప్రచారం
  • టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు
  • నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంటలు
  • పెట్రోల్ పోసి నిప్పంటించారన్న పాల్వాయి స్రవంతి

త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. ప్రచారం కోసం సిద్ధంగా ఉంచిన జెండాలు, పోస్టర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, తమను దెబ్బతీసేందుకు జరిగిన రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

ఈ ఘటనకు నిరసనగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మంటలు చెలరేగడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని అన్నారు. తాము విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించామని, అది షార్ట్ సర్క్యూట్ కాదని వారు తేల్చారని వివరించారు. ఇది కచ్చితంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. 

ఇది పిరికితనంతో చేసిన దుశ్చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని చూసి రెండు ప్రధాన పార్టీలు భయపడుతున్నాయని, ఇది ఆ రెండు పార్టీల కుట్రేనని అన్నారు. ప్రజల్లో తిరుగుతున్న తమకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్రవంతి పేర్కొన్నారు. ఈ ఘటనతో తమ మనోధైర్యం దెబ్బతింటుందని వారు భావిస్తున్నారని, కానీ తాము ఇంతకంటే ఉద్ధృతంగా ప్రచారం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

తాను ఈ ఘటనపై ఎస్పీతో మాట్లాడానని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సమాచారం అందించానని స్రవంతి వెల్లడించారు. రేవంత్ రెడ్డి బయల్దేరి వస్తున్నారని వెల్లడించారు.

More Telugu News