sprouts: స్ప్రౌట్స్ వల్ల ఉపయోగాలే కాదు.. ప్రమాదాలూ ఉన్నాయ్ జాగ్రత్త..!
- వీటిని విచ్ఛిన్నం చేయడం మన శరీరానికి కష్టమంటున్న వైద్యులు
- అజీర్ణం, కడుపుబ్బరం, అసిడిటీ, మలబద్ధకం సమస్యలు రావచ్చు
- కిడ్నీ, పైల్స్, జీర్ణ సమస్యలున్న వారు తినకపోవడమే మంచిదని సూచన
స్ప్రౌట్స్ (మొలకెత్తించిన గింజలు) మంచి పోషకాహారం. ప్రొటీన్ తగినంత అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా కొందరు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫాస్ఫరస్ స్ప్రౌట్స్ నుంచి లభిస్తాయి. అయితే, ఇవి జీర్ణం కావడం కొందరికి కష్టంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ అల్కా విజయన్ అంటున్నారు. మరి స్ప్రౌట్స్ అందరికీ అనుకూలం కాదా..?
‘‘నిజమే స్ప్రౌట్స్ లో తగినన్ని పోషకాలు ఉంటాయి. కానీ, మన శరీరం వీటిని విచ్ఛిన్నం చేయలేదు. దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం, పైల్స్ సమస్యలు దీర్ఘకాలంలో రావచ్చు. ఆధునిక సైన్స్ మాత్రం.. స్ప్రౌట్స్ లో తగినంత ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్ ఉంటాయని చెబుతోంది. కానీ, ఆయుర్వేదం ప్రకారం మొలకెత్తించిన గింజలు వాత గుణాన్ని ప్రకోపిస్తాయి. స్ప్రౌట్స్ అంటే కొంత గింజ, కొంత బేబీ ప్లాంట్ తో సమానం. కనుక జీర్ణం కావడం కష్టం. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. దీంతో ఆమ్ల రసాలు విడుదల అవుతాయి’’అని డాక్టర్ అల్కా విజయన్ వివరించారు.
న్యూట్రిషనిస్ట్ ఇష్టి సలూజా సైతం ఈ విషయాలను అంగీకరించారు. ‘‘ఉడికించని స్ప్రౌట్స్ ను తీసుకుంటే ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్న వారికి, తక్కువ రోగ నిరోధక సామర్థ్యం ఉన్న పిల్లలకు పాయిజనింగ్ అవుతుంది. వీటిల్లో అధిక ప్రొటీన్, ఫైబర్ ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సున్నితమైన పేగులు ఉన్న వారు కూడా స్ప్రౌట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిని విచ్ఛిన్నం చేసి, జీర్ణం చేయడం మన శరీరానికి కష్టమైన పని. దీంతో కడుపులో నొప్పి, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు కనిపిస్తాయి. మొలకెత్తిన గింజలతో ఈకొలి వంటి సూక్ష్మ జీవుల ఆధారిత అనారోగ్యం రావచ్చు. పైల్స్ తో బాధపడుతుంటే సమస్య పెద్దది అవుతుంది’’అని తెలిపారు.
జీర్ణ సమస్యలు లేని వారు, వాత, పిత్త దోషాలు లేని వారు, పైల్స్ సమస్యలు, కిడ్నీ సమస్యలు లేని వారు స్ప్రౌట్స్ ను పరిమితంగా తీసుకోవచ్చన్నది వైద్య నిపుణుల సూచన. అది కూడా నూనె, నెయ్యితో వేయించి తీసుకోవాలి.