Atchannaidu: మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు... అయినా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on AP Govt over three capitals issue

  • ఏపీ రాజధాని అంశంపై రగడ
  • విశాఖ గర్జన సభకు వైసీపీ సన్నాహాలు
  • మండిపడుతున్న విపక్షాలు
  • అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్
  • జగన్ వికేంద్రీకరణ గురించి మాట్లాడడం దుర్మార్గమన్న అచ్చెన్న

ఏపీ రాజధాని అంశంలో అధికార, విపక్షాల మధ్య మరింత అగ్గి రాజుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖలో గర్జన సభ ఏర్పాటు చేస్తుండడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అమరావతి ఒక్కటే రాజధాని అని నినదిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

"స్థానిక సంస్థలకు ఒక్క పైసా ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నావు. కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్ల నిధులను మళ్లించావు. ఈ విధంగా రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసిన నువ్వు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. జిల్లాకు ఒక రాజధాని, ప్రాంతానికి ఒక రాజధాని ఏర్పాటు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి, మీరు ప్రగల్బాలు పలికితే అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. 

నాడు ఐదు కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా నిండు సభలో సుదీర్ఘ సమయం పాటు చర్చించి, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ ఈనాడు అమరావతితో అభివృద్ధి జరగదని, అన్ని ప్రాంతాల నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో ఖర్చు చేస్తారని పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే విశాఖపట్నమో, కర్నూలో కాదు. 

మా హయాంలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాం. తిరుపతిలో హార్డ్ వేర్ హబ్, ఎలక్ట్రానిక్ హబ్ స్థాపించాం. ఇదేదో నేను అబద్ధం చెప్పడం కాదు... మీ వద్ద రికార్డులు ఉన్నాయి కదా! ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు వచ్చాయి? నువ్వే చెప్పు. 

ఎడారిలో ఉండే అనంతపురంలో ఇవాళ కియా పరిశ్రమ తీసుకువచ్చాం... కర్నూలు జిల్లాలో సోలార్, సిమెంటు పరిశ్రమలు తీసుకువచ్చాం. విత్తన అభివృద్ధి కేంద్రం తీసుకువచ్చాం, కోస్తాలో పోర్టు తీసుకువచ్చాం, పోలవరం నిర్మించాం. కాకినాడలో పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులు తీసుకువచ్చాం. విశాఖలో ఫార్మా, ఆర్థిక, టూరిజం రాజధానిగా తయారుచేయడానికి ప్రణాళికలు తయారుచేశాం... అభివృద్ధి అంటే అదీ! 

ప్రజల్లో నీ మీద ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికి వికేంద్రీకరణ అనడం దుర్మార్గం. ఇవాళ మూడు రాజధానులు అంటున్నావు... నీకేం అధికారం ఉంది? ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అధికారం లేని ఒక అంశాన్ని మళ్లీ ప్రజలపై పెట్టి, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పదు. 

రాజధానులను మార్చే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయి. ఒకవేళ రాజధానిని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాయి. 

ఈ విషయం జగన్ కు తెలుసో తెలియదో కానీ... నాడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏమన్నాడో ఓసారి చూద్దాం! ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, అయితే అందుకు అధికారం లేదు, రాజ్యాంగ సవరణ చేయండి అంటూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టాడు. ఇప్పుడా బిల్లు పెట్టిన విషయాన్ని కూడా పక్కనబెట్టి మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాట ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

ఇవాళ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నాడు, బొత్స సత్తిబాబు మాట్లాడుతున్నాడు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నాడు, కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు... విశ్వసనీయతలేని వ్యక్తులు అధికారంలో లేకపోతే ఒకలా మాట్లాడతారు, అధికారం ఉంటే ఒకలా మాట్లాడతారు. ధర్మానకు మంత్రి పదవి ఇచ్చేసరికి నోరు పెగిలింది... ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడు" అంటూ అచ్చెన్నాయడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Atchannaidu
YCP Govt
Three Capitals
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News