Women: చీరలో మహిళల కబడ్డీ.. భలేగా ఉందంటున్న నెటిజన్లు.. వైరల్​ వీడియో ఇదిగో

Women playing kabaddi in saree

  • ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన  క్రీడా పోటీల్లో చీరల్లో కబడ్డీ ఆడిన మహిళలు
  • దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్
  • ప్రొఫెషనల్ ఆటగాళ్లలా ఆడారంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు

కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కూత ఆపకుండా వెళ్లడం.. లైన్ తొక్కి వెనక్కి రావడానికి ప్రయత్నించడం.. ఎవరినైనా టచ్ చేసి అవుట్ చేయడానికి ప్రయత్నించడం.. ఒక్కోసారి అవతలి టీమ్ కు అడ్డంగా దొరికిపోవడం.. మనం చిన్నప్పటి నుంచీ కబడ్డీ ఆట ఆడినదే. కానీ ఇక్కడ మాత్రం మహిళలు కబడ్డీ ఆడటం, అదీ చీరలతో ప్రొఫెషనల్ పోటీల తరహాలో ఆడటం మాత్రం వైరల్ గా మారింది.

ఛత్తీస్ గఢ్ గ్రామీణ పోటీల్లో..
ఛత్తీస్ గఢ్ లోని గ్రామీణ ప్రాంతంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో మహిళలు కబడ్డీ ఆడారు. చుట్టూ పెద్ద సంఖ్యలో జనం నిలబడి చూస్తుండగా.. మధ్యలో గీసిన కబడ్డీ కోర్టులో ఉత్సాహంగా ఆడటం ఈ వీడియోలో కనిపిస్తుంది. తలపై కొంగు జారిపోతుంటే కప్పుకొంటూ కబడ్డీ ఆడటం గమనార్హం. చుట్టూ ఉన్న జనం ఉత్సాహంగా కేకలు వేస్తూ మహిళలను ప్రోత్సహించారు.
  • ఛత్తీస్ గఢ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘మేం ఎవరికన్నా తక్కువా? ఛత్తీస్ గడ్ ఒలింపిక్స్ లో మహిళల కబడ్డీ ఇది (హమ్ కిసీ సే కమ్ హై క్యా. ఛత్తీస్ ఘడియా ఒలింపిక్ మే మహిళా కబడ్డీ)’ అని హిందీలో క్యాప్షన్ పెట్టారు.
  • ఈ వీడియోకు ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు, రీ ట్వీట్లు కూడా వస్తున్నాయి. ఆ మహిళలకు నెటిజన్ల నుంచి భారీగా ప్రశంసలు వస్తున్నాయి.
  • ‘మహిళలు చీరలో కబడ్డీ ఆడినా.. ప్రొఫెషనల్ ఆటగాళ్లలా ఉన్నారు. వారిలో ఉత్సాహం చూస్తుంటే భలేగా ఉంది’ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
  • ‘మా ప్రాంతాల్లోనూ ఇలా మహిళలు కబడ్డీ ఆడుతారు. అలాగని వీళ్లను తక్కువ చేయడం లేదు. కబడ్డీ చాలా బాగా ఆడుతున్నారు.’ అని మరికొందరు పేర్కొంటున్నారు.

Women
Kabaddi
play kabaddi in saree
Offbeat
sports
Viral Videos
Chattisgarh
  • Loading...

More Telugu News